తండ్రికన్నను ముందుఁ దానె మేల్కని యగ్నిహోత్రమ్ము సరిచూచి యుముకఁబెట్టుఁ
దండ్రికన్నను సముద్యద్ఘోష మేపార నర్థర్చలును ఋక్కులనువదించుఁ
దండ్రికన్నను సమాహిత శ్రద్ధమై యుషర్బుధున కర్చాహవిర్బుధ్నము లిడుఁ
దండ్రికన్నను నిశ్చితజ్ఞానదృఢబుద్ధి బితృసమర్చాధురాప్రీతిఁ గాంచు
నతఁడు పుంరూప బ్రహ్మచర్యంబు శ్రద్ధ
ప్రోవు నెల్ల ప్రాయశ్చిత్తరూపమతఁడు
వాని నాషాఢమేఘమువోని వాని
నిటకు దెచ్చితివే ననావృష్టి తొలఁగు
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, ఇష్టి ఖండములో ఋష్యశృంగుని కథ, విశ్వనాథ కథాకథన చాతుర్యానికి ఒక మంచి ఉదాహరణ.
దుర్భిక్షం పాలయిన అంగదేశాన్ని మరల సస్యశ్యామలం చేయగలిగినవాడు ఒక్క ఋష్యశృంగుడేనని రోమపాదుని మంత్రులు, పురోహితులు చెప్పారు.
ఈ సీసపద్యంలో, ఋష్యశృంగుని యొక్క నిత్యానుష్ఠాన, అగ్నిహోత్ర విధులను అతడు యెంత శ్రద్ధతో నిర్వర్తిస్తున్నాడో, విశ్వనాథ చక్కగా చిత్రించారు.
ఋష్యశృంగుడిని స్త్రీపురుష భేదం తెలియకుండా పెంచాడు తండ్రి విభాండకుడు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, అహ్నిహోత్ర విధులను నిర్వహించడమే అతని పని.
" తండ్రి కంటె ముందే నిద్రలేచి, అగ్నిహోత్రం నిరంతరాయంగా వెలగటానికి, సమిధలు మొదలైనవి సమకూరుస్తాడు. తండ్రి కంటె చక్కగా, మంచి స్వరంతో స్తోత్రాలు, ఋక్కులు చదువుతాడు. తండ్రి కంటె ఎంతో శ్రద్ధగా అగ్నిహోత్రునికి అర్చనావిధులను, హవిస్సును అందజేస్తాడు. తండ్రి కంటె నిశ్చితమైన జ్ఞానంతో, దృఢబుద్ధితో, తండ్రికి ప్రీతి కలిగించే రీతిలో అర్చనలు చేస్తాడు. ఋష్యశృంగుడు పురుషరూపంలో ఉన్న బ్రహ్మచర్య దీక్ష, శ్రద్ధ, సర్వ ప్రాయశ్చిత్తాలకు మార్గం. ఆషాఢమేఘం వంటి అతడిని ఇక్కడకు తీసుకువస్తే, అనావృష్టి తొలిగిపోయి, మళ్ళీ ఈ దేశం సుభిక్షమౌతుంది. "
ఋష్యశృంగుడు ఆషాఢమేఘం వంటివాడు. ఆషాఢమాసంలో మేఘాలు సమృద్ధిగా వర్షిస్తాయి. ఋష్యశృంగుడు ఎక్కడుంటే అక్కడ సుభిక్షంగా ఉంటుంది.
ఇక పద్యంలో " తండ్రి కంటెను " అన్న మాటలు పునరావృతం అవటం వల్ల, ఋష్యశృంగుని నిత్యానుష్ఠానము, అగ్నిహోత్ర విధి, అర్చన, అధ్యయనాలు, మరింత నిష్ఠగా, శ్రద్దగా, తండ్రికి ప్రీతి కలిగించే విధంగా కొనసాగుతున్నాయని తెల్లమౌతున్నది.
No comments:
Post a Comment