గుండియజాఱిపోవుటకుఁ గోవిదమస్తక దేశరత్న మొ
క్కండు మహామహోజలధి కావలె నంచని యున్నదేమి యె
వ్వండునుజాలు శత్రుజనపాపభుజంగఫణాప్రణీత పా
దుండును దుష్టశిక్షణకుఁ దూఁగనిచో జగ మేమి కావలెన్.
ఉవిదను బాసియున్ బ్రదికియుంటిని గావున నీదు సఖ్యసం
భవతతిలోక భవ్య సుఖ భాజనుఁ డైతిని దీని చేత నా
యువిదను రాజ్యమున్ మఱల నొందెద నంచనునట్టి ధైర్యముం
దవిలితి మేనుపోయిన యనంతర మేమిపొనర్తు మేమగున్.
ఆపదలు వచ్చినప్పుడు ధైర్యం వహించాలని పెద్దల మాట. శ్రీరామచంద్రుడు సీతావియోగంతో దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. సుగ్రీవుడు, జానకి జారవిడిచిన నగలమూటను తెచ్చి చూపగానే దుఃఖవివశుడైపోయాడు. కళ్ళలో గిర్రున నీరు తిరగటంతో, నగలను గుర్తుపట్టలేకపోయాడు. ఉభయసంధ్యలలోను సీత పాదాలకు నమస్కరించే లక్ష్మణుడు మాత్రం వదినగారి కాలి అందెలను గుర్తుపట్టాడు. సోదరుని సౌశీల్యం, రాముని గుండెను కదిలించివేసింది. సీతను తలచుకొని దుఃఖిస్తున్న రాముడిని చూసి, అతని వంటి ధీశాలి మోహావేశానికి గురైతే, గుండెదిటవు లేని సామాన్యజనం సంగతేమిటని సుగ్రీవుడు అతడిని అనునయించాడు. రాముని జీవలక్షణానికి, సుగ్రీవుని జీవలక్షణానికి భేద మున్నప్పటికీ, భార్యావియోగ దుఃఖం తనకు కూడా అల్పం కాదని సుగ్రీవుడు చెప్పాడు. సుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు.
" ఆపద వచ్చినప్పుడు, గుండె జారిపోవటానికి చిన్నేమిటి, పెద్దేమిటి. జ్ఞానంతో పండిపోయినవాడికి, మహాసముద్రమంత గంభీరహృదయ ముండాలని లేదు. ఎవరికైనా దుఃఖం దుఃఖమే. కాకపోతే, శత్రువులనే పాముల పడగలపై కాలు వేసి త్రొక్కగలిగిన శక్తి కలవాడే దుష్టశిక్షణకు పూనుకొనకపోతే, ఇక యీ ప్రపంచం ఏమయి పోవాలి?
భార్యతో ఎడబాటు కలిగినా కూడా ఇంకా బ్రతికి ఉన్నాను కనుక, నీ స్నేహం పొందే భాగ్యం కలిగింది. నీ మైత్రి కారణంగా, పోగొట్టుకున్న భార్యను, రాజ్యాన్ని మళ్ళీ పొందుతాననే ధైర్యం కలిగింది. దిగులు పడి శరీరత్యాగం చేసిన తరువాత ఏం చేయగలం? ఏమవుతుందో ఎవరికి తెలుసు. "
శ్రీరాముడు ధైర్యవంతుడు, బుద్ధిశాలి, జ్ఞానపథ విహారి. అయినప్పటికీ, మానుషలక్షణమైన మోహావేశానికి తాత్కాలికంగా గురయ్యాడు. సామాన్యుని వలె, అవతారమూర్తి అయిన రాముని కిది తగదు. దానివల్ల, దుష్టశిక్షణ, శిష్టరక్షణకు భంగం కలుగుతుంది. ఆ విషయాన్నే సుగ్రీవుడు, దుఃఖోపశమనం చేస్తూ, రామునికి చెప్పాడు.
ఈ సన్నివేశం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండంలో ఉంది.
No comments:
Post a Comment