తన ప్రాణంబులు లేచి వచ్చినవి దైత్యస్వామికిన్ ముద్దుమ
న్మని వే చంకను గొంచుఁ జుంబనవిధామత్తుండు తా హంస ని
చ్చెనుఁ గ్రీడామయమైన వస్తువుగ నా చిన్నారి పొన్నారికిన్
మనుమండున్ దన తాత ముద్దిడుకొనెన్ మత్తాననార్థాక్షుఁడై.
అశోకవనంలో, చెట్టుకొమ్మపై నున్న రాజహంస సీతకు సందేశాన్ని వినిపించటం చూసిన రావణుడికి, తాను ఇన్నాళ్ళు నమ్ముకున్న దైవం శివుడు, హంస రూపంలో, దంపతుల మధ్య రాయబారం నడుపుతున్నాడని కోపం వచ్చింది.
అర్థరాత్రి వరకు అశోకవనంలో గడిపిన రావణుడు, నిద్రతో మూసుకుపోతున్న కళ్ళతో, శివపూజ చేయటానికి పూజామందిరానికి వెళ్ళాడు. అదే సమయంలో, నెల రోజుల క్రిందట హనుమ చేతిలో మరణించిన అక్షకుమారుడి కొడును వెంటబెట్టుకొని, కోడలు అక్కడకు వచ్చి, కొడుకు చేతిలోని వెండి హంస బొమ్మను మామగారి కిప్పించింది.
" ఆ బొమ్మను చూడగానే, దానవసార్వభుముడికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. అంతే ! రావణుడు మనుమడిని ఎత్తుకొని ముద్దాడి, ఆ బొమ్మను, ఆడుకొనమని చెప్పి మనుమడికి ఇచ్చాడు. మనుమడు కూడా తాతగారిని ముద్దు పెట్టుకున్నాడు "
సంశయ ఖండంలో విశ్వనాథ చేసిన ఈ కల్పన రావణుని మనస్సులో అనుమానపు బీజాన్ని నాటటానికి, ఆ తరువాత, తన పూజామందిరంలోని హంస (శివుడు) సీతారాముల మధ్య రాయబారం నడపటానికి వెళ్ళాడనుకొన్న రావణుడు, కోడలు హంస బొమ్మను తిరిగి ఇవ్వగానే, పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లుగా ఊపిరి పీల్చుకొన్నాడు. దంపతుల మధ్య రాయబారం నడిపింది తన శివుడ్ డు కాదని మళ్ళీ నమ్మకం ఏర్పడింది.
ఈ విధంగా శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండములోని హంసదౌయం, కథాపరంగా రావణుని మనస్సు సంశయ నిస్సంశయాల మధ్య ఊగులాడేటట్లు చేసింది. ఇది విశ్వనాథ కల్పనాచాతుర్యానికి నిదర్శనం.
No comments:
Post a Comment