భ్రంశపుఁగార్యముల్ పనికిరావు, నెఱుంగుదు నేను వాని, నీ
యంశమునందు నీ తలచినట్లు తలంపఁడు వాని పేరునన్
వంశపుమచ్చ దెచ్చెదవు వ్యర్థమెయౌఁజుమి యింత యత్నముల్.
దశరథుడు, రాముని మీద ప్రమాణం చేసి, మాట తప్పకుండా ఇస్తాన్నన్న రెండు వరాలను, పంచభూతాల సాక్షిగా, వంశకర్త సూర్యభగవానుని సాక్షిగా అడిగింది కైక. హతాశుడైన దశరథుడు, ఎన్నోరకాలుగా ఆమె మనసు మార్చటానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. చివరకు, సూర్యవంశానికి మచ్చ వచ్చినా సరే, మాట తప్పుతానన్నాడు. ఎంతకూ చలించని కైకతో, ఇంకా ఇలా అన్నాడు.
" భరతుని భావాలు ఎంతో ఉన్నతమైనవి. అతనికి ఈ శాస్త్రవిరుద్ధమైన పనులు పనికిరావు. అతని సంగతి నాకు బాగా తెలుసు. ఈ విషయంలో నువ్వు ఆలోచించినట్లు ఆలోచించడు. భరతుడి పేరు మీద సూర్యవంశానికి మచ్చ తెస్తున్నావు. నీ ప్రయత్నమంతా వ్యర్థమౌతుంది సుమా ! "
రాముడు, పట్టమహిషి అయిన కౌసల్య కుమారుడు. అందరిలోను పెద్దవాడు. జ్యేష్ఠుడు రాజ్యాధికారాన్ని చేపట్టడం శాస్త్రసమ్మతం. దానికి విరుద్ధమైనవి అపభ్రంశ కార్యాలు. భరతుడు, ఆకారవిశేషాలలోనే కాకుండా, ధర్మబుద్ధిలో కూడా రాముని పోలినవాడు. ఈ విషయం తండ్రికి తెలియకుండా ఉంటుందా? అదే చెప్పాడు దశరథుడు. రామాయణ కథలో చివరకు జరిగింది కూడా అదే.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనిది.
No comments:
Post a Comment