ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కల్గినన్
సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేక మబ్బినన్
మదికి నుదాత్త కల్పనల మక్కువ కల్గిన విశ్వనాథ శా
రద సకలార్థదాయిని సురద్రువు రామకథన్ భజింపుమీ !
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి బృహత్కావ్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము అవతారిక లోని ఈ పద్యం చాల ప్రసిద్ధమైనది.
విశ్వనాథవారి రచనలు అంత తొందరగా కొరుకుడు పడవనో, ఆయన ప్రతిభ చూసి కించిత్ అసూయతోనో, లేక వారి మీద ప్రేమ పొంగులువారి ముద్దుగానో, ఈ " అక్షరానేక బ్రహ్మాండ " సృష్టికర్తను " పాషాణపాక ప్రభు " వని పిలుస్తారు.
మహాకవుల రచనలు మహాగిరి శిఖరాలనుండి ఉద్ధృతితో ప్రవహించే జీవనదుల వంటివి. వాటిని అర్థం చేసుకోవాలంటే, పాండిత్యం కంటే, పాఠకుని జీవలక్షణంలో వాటిని గురించి తపన, పూర్వజన్మ సంస్కారం ఉండాలని నాకనిపిస్తుంది.
విశ్వనాథవారు శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్య రసాస్వాదన చేయాలంటే, సహృదయుడైన పాఠకునికి కావలసిన కొన్ని లక్షణాలను ఈ పద్యంలో ఉదహరించారు.
" నీ హృదయానికి పూర్వాంధ్ర సంస్కృత మహాకవుల కావ్యాల ప్రకాశం కలిగితే, నీ నిర్మలమైన బుద్ధికి అనేకమైన శాస్త్రరహస్యాలు తెలుసుకోవాలనే వివేకం కలిగితే, నీ మనస్సుకు ఉదాత్తమైన కల్పనల మీద ఆసక్తి కలిగితే, అప్పుడు, వివిధార్థాలను ప్రతిపాదించే, చతుర్విధ పురుషార్థాలను కల్గించే, స్వర్గలోకపు కల్పవృక్షం వంటి విశ్వనాథకృత శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్యాన్ని భక్తితో దరిచేరు. "
శ్రీమద్రామాయణ కల్పవృక్షము విశ్వనాథ తపఃఫలము. ఆ కావ్యాన్ని చదవాలంటే, చదివి అర్థం చేసుకోవాలాంటే, పఠితల జీవసంపుటిలో పైన చెప్పిన అర్హత లుండాలి. ఆ కావ్యం చదవాలని తపించాలి. అన్నిటికి తోడు గుర్వనుగ్రహం ఉండాలి. విశ్వనాథ గురువులకు గురువు. ఇది స్వీయానుభవం.
No comments:
Post a Comment