క్ష్వేడుఁడు వేయియేనుగుల చేవగలాఁడు జగద్భయంకర
క్రీడుఁడు దిఖ్ఖురాంచల వికీర్ణ వియద్గత మృత్పయోధర
క్రోడవిలాస విష్ణుపద కుత్సిత కాలకభావుఁ డుగ్రుఁడై.
బలమని యున్నచోనొడల వాఁడునుగాని స్వభావదుష్టుఁడై
వెలసిన వాని నొంచెదను వీని గలంచెదనంచుఁ గారణం
బులకయి సర్వదా వెదకుఁ బొందని గారణముల్ ఘటించు గొం
దలపడు నవ్యవస్థితమనస్కుఁడు వానికి సౌఖ్యమున్నదే.
" మొండివాడు రాజుకన్నా బలవంతు " డని సామెత రూపంలో చెప్పినా, " కోరి మూర్ఖుల మనసు రంజింపరాదు " అని పద్య పాదంగా చెప్పినా, అది దుందుభి వంటి దున్నపోతుల గురించే.
శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో చాలా చిన్న కథ లున్నాయి. దేని కదే ఒక రసరమ్య కావ్యం. అందులో కిష్కింధా కాండము లోని దుందుభి కథ ఒకటి.
విశ్వనాథ కథలు చెప్పే తీరులో ఒక విశిష్టత ఉంది. చెప్పబోయే కథకు పూర్వరంగంగా ఒక హేతువును కల్పించటం అది. ఋష్యమూకగిరికాననలక్ష్మి శరీరం మీద పురిపిడికాయ లాగా ఉన్న అస్థిపంజరాన్ని చూపించి, సుగ్రీవుని చేత దుందుభి కథను చెప్పించటానికి పుర్వరంగాన్ని సిద్ధం చేశారు విశ్వనాథ. అంతేగాక, కథ ఎత్తుకోవటమే " వీడొక రాక్షసుండు " అని చెప్పి, అతడి దుష్టస్వభావ వర్ణనకు నాంది పలికారు. ఇప్పుడు, విశ్వనాథ దుందుభిని వర్ణించిన తీరును చూద్దాము.
" దుందుభి అనే పేరు కల రాక్షసుడు వీడు. వీడి గొంతు భేరీనాదంలాగా ఉంటుంది. వీడు వేయి ఏనుగుల బలం కలవాడు. ప్రపంచాన్ని భయపెట్టడం వీడికి ఒక ఆట. వీడు కాలిగిట్టలతో ఆకాశంలోని మేఘాలను, మట్టిని ఎగజిమ్మినట్లు వెదజల్లుతూ, కొమ్ములతో కుమ్ముతూ, విష్ణువును నిందిస్తూ, కోపంతో కాలయముడిలాగా నాలుగు దిక్కులా సంచరిస్తుంటాడు.
ఎవడైనా బలవంతుడై, దానికి తోడు దుష్టస్వభావం కనుక ఉంటే, అటువంటివాడు, " వాడిని ఓడిస్తాను, వీడిని క్రుంగదీస్తాను " అంటూ, లేనిపోని కారణాల కోసం వెతుకుతుంటాడు. లేని కారణాలని సృష్టించుకుంటాడు. బాగా కలత చెందుతాడు. అటువంటి, పద్ధతి లేని మూర్ఖుడికి సుఖ మేముంటుంది. "
దుందుభి ఒక దున్నపోతు ఆకారం కల రాక్షసుడు. వాడి ఆకారమే కాదు, స్వభావం కూడా దున్నపోతు స్వభావమే. ఎవరిమీద పడితే వాళ్ళమీద కాలు దువ్వటం, తనంతటివాడు ఈ విశ్వంలో లేడని విర్రవీగడం వాడి సహజప్రవృత్తి. మిడిసిపడేవాడు ఎప్పటికైనా మడిసిపోక తప్పదు కదా ! దుందుభి వథకు మూలకారణమైన ఈ మితిమీరిన మూర్ఖత్వాన్ని విశ్వనాథ ఈ పద్యాలలో అద్భుతంగా చిత్రించారు.
No comments:
Post a Comment