అచ్చమైన యమృత మమరులు త్రావినా
రోయి ! దాని కే నసూయపడను
పరమమౌనియైన వాల్మీకికృత రామ
సత్కథా సుధారసంబుఁ ద్రావి
సర్వకావ్యవాక్కు జనియించె నే ముని
వదన సీమనుండి వానిఁ దలఁతు
సర్వశిల్పభూమి సర్వలక్షణలక్ష్య
నవ విధాతృభూతు నాకుజాతు
ఈ సంసార మిదెన్ని జన్మలకు నేనీ మౌనివాల్మీకి భా
షాసంక్రాంతఋణంబుఁ దీర్పఁగలదా? సత్కావ్యనిర్మాణ రే
ఖాసామాగ్రి ఋణంబుఁ దీర్పఁగలదా? కాకుత్స్థుఁడౌ స్వామి గా
థాసంపన్నము భక్తిఁ దీర్చినను ద్వైతాద్వైతమార్గంబులన్.
ఒక్క వాల్మీకి కాక వేఱొక్కఁ డెవఁడు
సుకవిశబ్దవాచ్యుం డిఁకఁ గుకవినింద
అప్రశస్తపథంబుగా నవుటఁ జేసి
మునిఋణముఁ దీర్ప నీ కావ్యమును రచింతు
అచ్చమైన అమృతం దేవతలు త్రాగారు. దానికి తెలుగువారెవరూ అసూయపడరు. కారణం, రామాయణ కల్పవృక్షాన్ని విశ్వనాథ తెలుగు జాతికి ప్రసాదించారు కనుక. కల్పవృక్షంలోని ప్రతి పద్యం రసరమ్యం కాగా, అందులోని అవతారిక చాలా అందమైనది, ఆలోచనామృతాన్ని కురిపించేది.
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలోని పద్యాలను ఎన్నిసార్లు చదివినా తనివితీరదు. " శ్రీ మంజూషిక " అయిన పరమేశ్వరుని స్తుతితో ప్రారంభమైన అవతారిక " బంధుర రీతి వేరయిన భావములున్ బ్రతుకుల్ మహాదయాసింధువు " లయినవారితో ముగుస్తుంది. ఈ అవతారికలో ఇష్టదేవతాప్రార్థన దగ్గరినుంచి, మరల రామాయణం వ్రాయవలసిన అవసరం, రామాయణం వ్రాసేందుకు ప్రేరణ, పితృభక్తి, భాతృప్రేమ, గురుప్రశస్తి, మిత్రవాత్సల్యం, ప్రాచీనాంధ్ర మహాకవుల కవితా రీతులు, స్వీయకవిత్వ ధోరణి, సంస్కృతకవులకు నివాళి, కవిత్త్వతత్త్వవిచారణ, చివరగా మానవ సంబంధాల స్పర్శతో.....ఎన్ని.....ఎన్నెన్ని అంశాలు స్పృశించారు. ప్రతిదీ, హృదయానికి హత్తుకొనేటట్లు, ప్రమాణపూర్వకంగా, మనస్సన్యాసిగా, అద్దంలో చూపించినట్లు వ్రాశారు.
ప్రస్తుత విషయం, వాల్మీకి మహర్షి స్తుతి. ఆదికవి వాల్మీకి మహర్షికి ఇంత సుగంధభరితమైన నీరాజన మెవరివ్వగలరు? విశ్వనాథ అంటున్నారు:
" అచ్చమైన అమృతాన్ని దేవతలు త్రాగారు. దానికి నేను అసూయపడను. ఎందువల్లనంటే, మహర్షి వాల్మీకిచే రచింపబడిన రామాయణసుధను తనివితీరా త్రాగాను కనుక. సమస్త కవితా ప్రపంచం ఏ ముని ముఖం నుండి వెలువడిందో , అన్ని శిల్పరహస్యాలు, అన్ని లక్షణలక్ష్యాలకు ఎవరు ఆద్యుడో, ఆ కవితాబ్రహ్మకు, పుట్టమునికి నేను నమస్కరిస్తున్నాను.
కాకుత్స్థ వంశస్థుడైన రామచంద్రుని కథను భక్తితో, ద్వైత, అద్వైత మార్గాల్లో ఎన్నివిధాలుగా, ఎందరు తీర్చిదిద్దినా, వాల్మీకి మహర్షి దేవభాష అయిన సంస్కృతానికి వన్నె తీసుకు వచ్చినందుకు భాషాఋణాన్ని , సత్కావ్య నిర్మాణానికి కావలసిన సాధనసామాగ్రిని సమకూర్చిపెట్టిన ఋణాన్ని, ఈ కావ్యప్రపంచం తీర్చుకోగలదా?
సుకవి శబ్దానికి ఒక్క వాల్మీకి మహర్షి మాత్రమే అర్హుడు కనుక, కుకవి నిందకు ఇక్కడ తావులేదు. ఇక నేను, మునిఋణం తీర్చుకొనేందుకు రామాయణాన్ని వ్రాస్తున్నాను. "
అన్ని భాషలకు తల్లి సంస్కృతం. అటువంటి సంస్కృతభాషలో ఆదికావ్యం రామాయణం. ఆదికవి వాల్మీకి. అందువల్లనే, ఆ మహానుభవుని ఋణం తీర్చుకోలేనిది. కుకవి నింద చేయటం అనేది కావ్యరచనలో సంప్రదాయం. ఆ కుకవి నిందను, ఇంత వినయపూర్వకంగా చేసి, మునిఋణం తీర్చటానికి తాను రామాయణాన్ని వ్రాస్తున్నాననడం, గాఢప్రతిభుడైన విశ్వనాథకే చెల్లింది.
No comments:
Post a Comment