డో యంచచ్చెరువంది చూచెదరు తీవ్రోద్యోగ నైష్ఫల్యమై
నా యణ్వేషణ సాగదం చపఘనాంతత్వమున్ సంవృతిం
గా యాదృచ్చిక మల్పరూపమునఁ బోఁగాఁజొచ్చె నామేరకున్.
బురుజుల నిల్చి నిచ్చలును బోయెడు వచ్చెడు శత్రుచారమున్
గరికొని చూఁడగాఁదగిన కౌణపరాజభటుల్ ప్రమత్తులై
గరువముచేత వార్థిపయిఁగాంచరు మారుతి వచ్చుటే యెఱుం
గరు పరిగుప్తయాత్రుఁడు ప్రకంపనసూనుఁడు చేరునంతకున్.
కొంచెము సేపు వానరము, కొంచెము సేపు మృగేంద్రమున్, మఱిం
గొంచెము సేపు గృధమును క్రోడము కొంచెము సేపు చూడగా
గొంచెముకాల మశ్వమును గుజ్జగు రూపము లంది యేగుచున్
వంచనచేసెఁ జూపఱను బావని పావనమూర్తి ధృష్ణుడై.
హనుమ, లంకాపట్టణ సమీప ప్రాంతానికి వచ్చాడు. కనుచూపు మేరలో ఉన్న పుష్పఫల సంభరితమైన అడవులను చూసి సంతృప్తి చెందాడు. ఆక్కడనుండి, తాను వచ్చిన పని గుర్తుకువచ్చి ఇలా అనుకొన్నాడు.
" పర్వతాకారంలో ఉన్న నా శరీరాన్ని చూసి వీడెవడో అని రాక్షసులందరూ నా వంక ఆశ్చర్యంగా చూస్తారు. దానితో నా పనికి తీవ్రమైన ఆటకం కలిగి అన్వేషణ సాగదు. " అనుకొని, హనుమ తన శరీరాన్ని ఇష్టమొచ్చిన రీతిలో కుదించుకొని ముందుకు పోసాగాడు.
కోట బురుజుల మీద నిల్చొని కాపలా కాస్తున్న ఆయుధధారులైన రాజభటులు, ఏమరపాటుతో, గర్వంతో, ఉండటం వల్ల, వారికి వాయునందనుడు అల్పదేహంతో సముద్రము పైనుండి వచ్చి త్రికూటగిరిని చేరేంతవరకు, ఆ సంగతి తెలియనే తెలియదు.
ఇక హనుమ కూడా, వారికి అనుమానం కలుగకుండా, కొంచెంసేపు వానరరూపంలో, కొంచెంసేపు సింహంగా, మరింకొంచెం సేపు పక్షిలాగా, కాసేపు వరాహంగా, చూస్తుండగానే అశ్వరూపంలో, అల్పరూపాలు ధరిస్తూ, చూసేవారి కన్నుగప్పుతూ, పావనమూర్తి వాయుపుత్రుడు ధైర్యంగా ముందుకు పోసాగాడు. "
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోని యీ పద్యాలలో హనుమ యొక్క బుద్ధిసూక్ష్మత మరొకసారి ఋజువయింది. కార్యసాఫల్యాన్ని కోరేవాడు పరిసరాలను జాగ్రత్తగా చూసుకొంటాడు. తన ఉగ్రరూపంతో వెళ్తే, అసలు పనికి మోసం వస్తుందని గ్రహించిన హనుమ, తన ఇచ్చవచ్చిన రీతిలో రూపాలను మార్చుకొంటూ, అల్పదేహంతో త్రికూటగిరి సమీప అరణ్యప్రాంతంలో జంతు, పక్షి రూపంలో సంచరింపసాగాడు.
చివరి పద్యంలో పంచముఖాంజనేయ స్వరూప దర్శనం గమనార్హం.
No comments:
Post a Comment