నికిఁ దా నింతటి దైన్యముం గలుగునే నిక్కంబుగాఁ దల్లి ! యిం
తకు నేఁ జాలుదునా? ధరాపతికి నేతాదృక్రుథాహేతుపా
తక మే నేమి పొనర్చి యుందునొకొ జింతాదుర్గమం బయ్యెడిన్
తండ్రి పిలిచాడని సుమంత్రుడు చెప్పగానే, రాముడు పినతల్లి కైక గృహానికి వెళ్ళాడు. చింతాక్రాంతుడై ఉన్న తండ్రిని చూసి నిర్విణ్ణుడై, తండ్రి పాదాలకు, కైకమ్మకు పాదాలకు నమస్కరించాడు. తండ్రిని పలుకరించినా బదులు లేకపోయేటప్పటికి, తండ్రి ముఖం వంక చూస్తూ, " రాగానే ఒళ్ళో కూర్చొనబెట్టుకొని, తల మీద ముద్దు పెట్టుకొనే తండ్రి ఆ విధంగా చేయకుండా దుఃఖంగా ఉన్నాడేమిటని " ఆశ్చర్యంగా పినతల్లిని అడిగాడు. తనవైపు చూడను కూడా చూడకుండా ఉన్న తండ్రికి ఇంత కోపం రావటానికి కారణ మేమయి ఉంటుందో, తండ్రి పినతల్లి కైకకు చెప్పే ఉంటాడని, అది తనకు చెప్పి తన ఆరాటాన్ని తగ్గించమని కైకను వేడుకొన్నాడు. రాముడు తన హృదయంలోని ఆవేదనను ఇంకా ఇలా వెలిబుచ్చాడు.
" అమ్మా ! నేనేదో పెద్ద తప్పే చేశానని అనుకుంటున్నాను. లేకపోతే తండ్రి ఇంత దైన్యంగా ఎందుకుంటాడు? తండ్రి యొక్క ఇంత దైన్యాన్ని నేను తట్టుకొనగలనా? రాజు యొక్క ఆ కోపానికి కారణమైన పాపం నేనేమి చేసి ఉంటానోనని తెలియక మనసంతా అల్లకల్లోలమౌతున్నది. "
దశరథుడికి రాముడు బహిఃప్రాణం. అటువంటి ప్రేమాస్పదుడైన తండ్రి మాటాపలుకూ లేకుండా దుఃఖమూర్తిగా ఉండటం రాముడు చూడలేకపోయాడు.
రాముని హృదయం లోని ఆవేదనను ప్రతిబింబిస్తున్నది శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోని యీ పద్యం.
No comments:
Post a Comment