బతినిర్హారి పరాక్రమోల్బణము దేవాధీశ సంతోషణం
బితిహార్దాకృతియున్ ద్రినేత్రము ధరాభృత్పాణియే వెల్గొకం
డతిలోకంబు డిగెన్ సురారిపుర పర్యంతాద్రికూటంబునన్.
ఈ పద్యంలో పంచముఖాంజనేయ స్వరూపంలో నారసింహ స్వరూపాన్ని వర్ణించారు విశ్వనాథ.
సింహం శరీరం , అగ్ని జ్వాలలను ఎగజిమ్మే ముఖం, దేవతల శత్రువులైన దైత్యుల గర్వాన్ని అణచే అతి విస్తృతమైన పరాక్రమోతిశయం, దేవేంద్రునికి సంతోషదాయకం, హితం, స్నేహం సమ్మిళితమైన తత్వం, త్రినేత్రం, మేరుపర్వతాన్ని విల్లుగా ధరించిన శైవాంశం కలబోసిన కాంతిపుంజం, లోకాతిశయమైన రూపు కలవాడొకడు, దేవతలకు శత్రువైన రావణుని లంకానగర ప్రాంతంలోని త్రికూటగిరి మీద దిగాడు. "
పంచముఖాంజనేయ స్వరూపంలో నారసింహ రూపం దక్షిణ ముఖాన్ని సూచిస్తుంది..
రామరావణ యుద్ధకాలంలో, రావణుడు మంత్రశక్తితో అహిరావణుడనే వాడిని సృష్టించి, రామలక్ష్మణులను పాతాళలోకానికి ఎత్తుకువెళ్ళాడట. ఈ అహిరావణుడి పంచప్రాణాలను, నాలుగు దిక్కులు, ఆకాశంలోను, ఐదు దీపాలలో పెట్టాడని, ఆ ఐదు దీపాలను ఒకేసారి ఆర్పినపుడే, అహిరావణుడు సంహరింపబడతాడని ఒక ఐతిహ్యం. ఆ కార్యసిద్ధి కోసం శివుని అంశావతారమైన హనుమ పంచముఖ స్వరూపంతో అహిరావణుడిని నిర్జించాడని అంటారు.
హనుమ మహాయోగి. పంచముఖాంజనేయ స్వరూపం, పంచేంద్రియ నిగ్రహాన్ని సూచిస్తుందని పెద్ద లంటారు.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనిది.
No comments:
Post a Comment