మారణ మాచరించెదను మామకమై చను క్షత్రియత్వ మే
దారిదియో కటా! సహజతం గనె దంచునుగాక నీ గళాం
భోరుహ మిట్లు త్రొక్కుటయుఁ బుట్టునె నాకు దయాదిలోకముల్.
ఓయీ ! సీతఁ ద్యజింపడాయసుర, యేదో దివ్యబాణంబుచే
మాయంజేసి ధరాత్మజాతఁ గొనలేమా ! వాని మ్రందించు టే
లా ! యీ చంపుటయో కసాయిపని మేలన్నట్లుగా నున్న ద
య్యో ! యా కత్తులఁ గ్రుమ్ము పేషణము ప్రాణోత్క్రాంతి దుర్భాష్యమౌ.
ఊహకు నందదే, బ్రదికియుండినవానిని బూడ్చి పెట్టినా
మే ! హరి ! వానినేమొ వధియించినయట్లగునా యిఁకొక్క స
న్నాహముచేతఁ దద్వధమనన్ ఘటియిల్లదు, చంపవద్దునా
నో హరిసాహరిన్ దినుచునుండె ఋషీంద్రుల దైత్యుఁడాతడై.
తనపూర్వంబగు జన్మలో గలుగు వృత్తాంతంబు తానే యెఱుం
గును, దుష్టాచరణంబు నేపగిదిఁ గైకొన్నాఁడు నన్ గాంచినం
తన పూర్వస్మృతి కల్గెనా ! వెదకుచుం దా వచ్చెనన్నాఁడుగా
ననుఁ బైశాచిక దేహమే బలమొ గంధర్వత్వ భావానకున్.
తనను గోతిలో పూడ్చిపెట్టి శాపవిముక్తి కలిగించమని రాముడిని విరాధుడు వేడుకొన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు విరాధుని గొంతు మీద కాలుపెట్టి, ఇలా అన్నాడు.
" ఓయీ ! శరభంగముని ఆశ్రమానికి వెళ్ళే దారి చూపించావు. సీతను తల్లిగా భావించావు. అటువంటి నిన్ను చంపుతున్నాను. ఇక నా క్షత్రియత్వం ఏ దారిలో పోతున్నదో? నీ సహజమైన రూపం నీకు ప్రసాదించటానికి నీ గొంతు మీద కాలు వేసి తొక్కితే నాకు పుణ్యలోకాలు దక్కుతాయా? "
ఇట్లా అని, అన్నదమ్ము లిద్దరూ విరాధుడిని కత్తులతో క్రుమ్మి, గోతిలో పూడ్చి పెట్టి, రాళ్ళతో కప్పిపెట్టారు. విరాధుడు చెప్పినట్లుగా శరభంగాశ్రమం వైపు నడచి కొంతదూరం వెళ్ళిన తరువాత, రాముడు తమ్ముడి వైపు తిరిగి, కలత చెందిన మనస్సుతో, ఇలా అన్నాడు.
" లక్ష్మణా ! విరాధుడు సీతను వదిలిపెట్టలేదు. అయితే, ఏదో ఒక దివ్యబాణంతో, వాడిని మాయజేసి సీతను దక్కించుకొనలేమా? అతడిని యీ రకంగా చంపట మెందుకు? ఆ చంపటం కూడా కసాయిపని మేలన్నట్లుగా ఉంది. అయ్యో ! కత్తులతో క్రుమ్మి, సజీవుడిని పూడ్చిపెట్టడం, ప్రాణోత్క్రమణానికి దుర్భాష్యం చెప్పినట్లవుతున్నదే !
ఊహకు అందనంతఘోరంగా, బ్రతికి ఉన్నవాడిని పూడ్చిపెట్టామే ! దీనిని వధించటం అంటారా? కానీ, ఇంకొక విధంగా అతడిని చంపటం కుదరదు. పోనీ, చంపకుండా వదలిపెడదామంటే, రాక్షసుడిగా అతడు మునులను చంపి తింటున్నాడు కదా !
విరాధుడికి తన పూర్వజన్మ వృత్తాంతమంతా తెలుసు. అంతా తెలిసి, ఈ దుర్మార్గపు పనులు ఎలా చేస్తున్నాడు? నన్ను చూడగానే, పూర్వజన్మ స్మృతి వచ్చిందా? నన్ను వెతుక్కొంటూ వచ్చానన్నాడుగా? గంధర్వ భావానికి, పిశాచదేహమే బలమా? "
శ్రీమద్రామాయణ కల్పవృక్షములో పలుతావుల్లో శ్రీరాముడు నిర్వేదాన్ని పొందటం గమనార్హం. తాటక వధ తరువాత కూడా, రాముడు ఇదే విధమైన నిర్వేదానికి గురయ్యాడు. రామావతార విశిష్టత అదే. మానవుడిగా జన్మించిన రాముడు, క్షత్రియధర్మంగా దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తూ, వారందరూ తెలిసి తెలిసి హింసకు పాల్పడుతూ, తనచేతిలో వధింపబడితున్నారని, మానవీయ కోణంలో నిర్వేదం పొందటం, మానవప్రవృత్తికి చాలా దగ్గరగా ఉంది..
No comments:
Post a Comment