సింధులువారు నేఁగఠిన చిత్తుడ వారికి నాకుఁ బూర్వసం
బంధములెట్టివో తెలియ బట్టవు నా కృతి వారి నామముల్
సంధితమయ్యె నిక్కమగు స్వర్గము వారికి నన్నినాళ్ళులై.
విశ్వనాథ సత్యనారాయణగారు పరుషంగా మాట్లాడతారని కొందరంటుంటారు. ఆయనతో సన్నిహితంగా ఉండేవారు, శిష్యులు మాత్రం ఆయనంత దయార్ద్ర హృదయు డింకొక రుండరంటారు.
ఈ పద్యం, విశ్వనాథవారి ఆర్ద్రచిత్తానికి అద్దం పట్టే మచ్చుతునక.
విశ్వనాథ సత్యనారాయణగారి చిన్ననాటి స్నేహితులు కొడాలి ఆంజనేయులుగారు, కొల్లిపర సూరయ్య చౌదరిగారు, కపిలేశ్వరపురం గ్రామకరణం అగస్త్యరాజు రాఘవరావుగారు, గొట్టిపాటి బ్రహ్మయ్యగారు, నాయని సుబ్బారావుగారు. వీరందరినీ శ్రోతలుగా చేస్తూ శ్రీమద్రామాయణ కల్పవృక్షము వ్రాస్తున్నామన్నారు విశ్వనాథ. సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులుగారిచే ఆధునికాంధ్ర మహేతిహాసమని కీర్తించబడిన వేయిపడగలు నవలలో అగస్త్యరాజు రాఘవరావుగారిని కుమారస్వామిగను, నాయని సుబ్బారావుగారిని కిరీటిగను చిత్రించారు. కరీం నగరంలో నివసించిన, జువ్వాడి గౌతమరావుగారికి తమ " భ్రష్టయోగి " కావ్యాన్ని అంకితమిస్తూ వారిని " తన తొలుతటి జనుస్సుల కూరిమి చెలికాడు " గా అభివర్ణించారు. ఇక ఈ పద్యంలోని వారి హృదయసౌశీల్యాన్ని చూడండి.
" నా మిత్రులందరూ ఒప్పిదమైనటువంటి వేరు వేరు భావాలు కలిగి బ్రతుకుతున్నవారు. వారందరూ మహాదయాసముద్రులు. నేను కఠినచిత్తుడిని. నా కావ్యంలో వారి ప్రసక్తి రావటానికి, వారికి నాకు మధ్య నున్న గతజన్మల బంధ మేమిటో నాకు తెలియటంలేదు. నా కావ్యం బ్రతికినంతకాలం వారికి స్వర్గలోకవాసం కలగాలని కోరుకుంటున్నాను. "
ఇదీ విశ్వనాథవారి నవ్యనవనీత సమానమైన నిండుమనస్సు.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలో చివరిది.
No comments:
Post a Comment