మీ దే దేశము మీరలున్ ద్విజులెకా మీ నామధేయంబు లె
ట్లై దీపించును శూద్రమాంసమును వాడన్ నేను, మీరిట్టి రం
చాదిం జెప్పుఁ డెఱుంగరానిదగు నే యన్నంబు నే ముట్ట, క్షు
ద్వాదుల్ క్షుద్రజనుల్ భుజింతు రటవీపర్యంత మేదైననున్.
శ్రీమద్రామాయణ కల్పవృక్షములోని చిన్న కథలలో విరాధ వధ, దుందుభి వృత్తాతం మొదలైనవి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు విశ్వనాథ.
అరణ్యంలో సీతారామలక్ష్మణులు నడిచి వెళ్తున్నారు. సీత అందరి.కంటె వెనుకగా నడుస్తున్నది. ఆ సమయంలో విరాధుడనే రాక్షసుడు ఆమెను పట్టుకొని వికటాట్టహాసం చేశాడు. సీత ఆక్రందనలను విన్న రామలక్ష్మణులు నిశేష్టులయ్యారు. కొంతసేపటికి తెప్పరిల్లి, రామలక్ష్మణులు వాడిని మాటలలో దించారు. విరాధుడనేవాడు యీ ప్రాంతంలో మునుల పాలిట యముడిలాగా ఉన్నాడని తెలిసి కూడా, తాపసుల వేషంలో ఉన్న రామలక్ష్మణులు అక్కడకు రావటం దుస్సాహసమని అన్నాడు రాక్షసుడు. సిగ్గులమొగ్గగా ఉన్న సీతను తనకు ఇల్లలిని చేసుకుంటానన్నాడు. ప్రతిరోజు ఏనుగు పచ్చిమాంసం తిని, రుచికరమైన నరమాసం కోసం మొహంవాచి ఉన్నానన్నాడు. త్వరగా స్నానం చేసి వస్తే, తన భోజన కార్యక్రమం మొదలుపెడతానన్నాడు. విరాధుడు ఇంకా వారిని ఎన్నో ప్రశ్నలడిగాడు.
" అసలు మీదే దేశం? మీరు ద్విజులే కదా? మీ పేర్లేమిటో. నేను శూద్రమాంసాన్ని తినను. మీరు ఫలానా అని ముందే చెప్పండి. నిర్ధారించుకోకుండా ఏ ఆహారాన్నీ నేను ముట్టుకోను. అన్నం కోసమే పుట్టినవాళ్ళు, నీచజాతి వాళ్ళు అడవిలో ఏది దొరికితే అది తింటారు. నేనట్లా చేయను. "
విరాధుడు శాపగ్రస్తుడైన గంధర్వుడు. ఇప్పుడు పిశాచరూప మెత్తాడు. అయినా, లోపల దాగి ఉన్న గంధర్వుని జీవలక్షణం, వాడినలా సంస్కారయుతంగా మాట్లాడిస్తున్నది. లోపల ఎవరికోసమో వెతుకులాట, బయటికి కనపడేది మాత్రం రాక్షస ప్రవృత్తి. రామలక్ష్మణులతో మాట్లాడే తీరు చూస్తే ఏదో సన్నిహితులతో మాట్లాడినట్లుగా ఉంది. ఈ రకమైన గంధర్వ రాక్షస జీవలక్షణాల సమ్మేళనంతో, విరాధుని పాత్ర అద్భుతంగా మలచబడింది.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనిది.
No comments:
Post a Comment