చైనంగాదు వచించెదం జనవుచే నా దైత్యసంతాన మే
మైన న్నీకపరాథమున్ సలిపెనా యౌఁగాని నిర్హేతుక
ప్రాణాపాయము వారికేటికి ఘటింపంజూతువో చెల్లరే
క్రమ మొప్పంగను నాల్గు ధర్మములలోఁ గైపూనగా క్షత్ర ధ
ర్మము కోదండము, పూని యార్తజన సంరక్షావిధానంబు ధా
ర్మము వాగ్దానము తీర్చుటో పరమ ధర్మం, బీ త్రయీధర్మ ము
త్తమ మస్పత్ప్రియ మీ తపస్విజన మద్దా ! యేమికానౌనొకో.
పైనిన్ మీ సకలాస్త్ర వైభవము విశ్వామిత్ర దత్తంబు, తా
నైనన్ గాధిజుఁడన్న మాౠషియ, నీ కస్మద్వధద్రోహిసం
తానంబూడ్చుట తప్పదన్న బలవంతంబైన నేమందు, వా
గ్దానంబిచ్చితి నట్లెచేతునని సత్యం బేమిచేయన్ వలెన్.
వలసిన నిను వదలెదనో
వలసిన సౌమిత్రిఁగూడ వదలెదనో మై
థిలి ! తనచేయుఁ బ్రతిజ్ఞా
స్ఖలనము ప్రాణంబుతోడఁ గానీకుండన్.
శ్రీరాముడు దండకారణ్యం లోని మునిసంఘాలకు, రాక్షస బాధ నుండి వారిని కాపాడతానని వాగ్దానమిచ్చాడు. ఈ మాట చెప్పవచ్చా, చెప్పకూడదా అన్న ఊగిసలాడి, చివరకు ధైర్యం కూడగట్టుకొని, సీత రామునితో ఇలా అన్నది.
" నా కొచ్చిన ఈ మాత్రము ఊహ నీకు రాలేదని గానీ, నీ కంటె తెలిసినదాన్నని గాని చెప్పటం లేదు. నీ భార్యననే చనువుతో చెపుతున్నాను. ఆ రాక్షసులు నీ కేమైనా అపకారం చేశారా పెట్టారా? అది సరేగాని, ఏ కారణం లేకుండా వాళ్ళకి ప్రాణహాని ఎందుకు తలపెడతావు?
ఇది విన్న రాముడు, సీతతో ఇలా అన్నాడు.
" ఒక క్రమంలో చెప్పాలంటే, నాల్గు వర్ణాశ్రమ ధర్మాలలో, క్షత్రియుని యొక్క మొదటి ధర్మం విల్లుని చేబూనటం. ఇక విల్లుని చేబూని చక్కగా శిష్టరక్షణం చేయటం ధర్మం. ఇచ్చిన మాటకు కట్టుబడి దానిని తీర్చటం పరమ ధర్మం. ఈ మూడు ధర్మాలు చాలా ఉత్తమమైనవి. ఇక యీ తపస్విజన మంటావా నాకు చాలా ఇష్టమైనవారు. ఏమవుతుందో చూద్దాం.
పైగా, ఆ మును లేమన్నారో తెలుసా? మా దగ్గరున్న సకల అస్త్ర సంపద వాళ్ళ ఋషికులం వాడైన గాధేయు డిచ్చినదేనట. ఆ కారణం చేత, వాళ్ళను చంపుతున్న దితిసంతానాన్ని సంహరింపక తప్పదని బలవంత పెట్టారు. ఇక నే నేమంటాను? సరేనని మాట ఇచ్చాను. ఏం చేయాలి? ఆడి తప్పకూడదు కదా !
సీతా ! ఇంకొక మాట చెబుతాను విను. కావలసివస్తే, నిన్ను వదలుకొంటాను, లక్ష్మణుడిని కూడా వదలుకొంటాను. కానీ, ప్రాణముండగా, నేను చేసిన ప్రతిజ్ఞకు భంగం వాటిల్లనీయను. "
ధర్మం పట్ల శ్రీరాముడెంత నిర్దయుడో, ఈ ఉదంతం తేటతెల్లం చేస్తుంది.
విశ్వనాథను పాషాణపాకప్రభువని మెత్తని హృదయం కలవారెవరైనా అనగలరా? సామాన్యమైన తెలుగు లోగిళ్ళలో మాట్లాడుకొనే రీతిలో, గుండెకు హత్తుకొనే రీతిలో, భార్యాభర్తల మధ్య సంభాషణను, సన్నివేశానికి తగ్గట్లుగా, ఒక మహాకావ్యంలో నడపటం, ఒక్క విశ్వనాథకే చెల్లింది.
విశ్వనాథ ఋషీ ! మా తెలుగు జాతి కింతకంటె ఇంకేం కావాలి?
ఇంత చక్కని పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండములో ఉన్నాయి.
No comments:
Post a Comment