అతనికి లోకమే తెలియ దగ్నియుఁ దండ్రియు నిద్రఱే జగ
మ్మతనికి, బ్రహ్మచర్య మిపుడైనను నట్లె ద్విధాగతి ప్రసా
రితముగఁ బొల్చు నవ్వనిఁ జరించును, దూరపుదోఁట పోఁడు
లోభితమతి కాఁడు, స్త్రీ పురుషభేదము కూడ నెఱుంగఁడింతయున్.
శ్రీమద్రామాయణ కల్పవృక్షములోని ఉపాఖ్యానాలలో ఋష్యశృంగుని వృత్తాంతం ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నది. రామావతారానికై నిర్వహింపబడిన పుత్రకామేష్టికి ఋష్యశృంగుడు అథ్వర్యుడు. ఈ విధంగా ఋష్యశృంగుని కథ ప్రధాన కథతో అనుసంధానమై ఉంది. అయితే, ఋష్యశృంగుని కథను విశ్వనాథ మలచిన తీరు ఆంధ్ర మహాభారతంలో నన్నయగారి ఋష్యశృంగునికి మెరుగులు దిద్దుతూ, కవిసమ్రాట్టుల కథాకథనశక్తికి అద్దం పడుతున్నది.
" మహాతపస్వి యగు కాశ్యపునకు విభాండకుండు పుట్టె, నవ్విభాండకునకు ఋష్యశృంగుడను కుమారుండు కలిగెను. ఆ ఋష్యశృంగుండు విభాండకుని కన్నులకు వెన్న్నెలవత్తి; తండ్రి యాయననట్లు పెంచె. "
ఇదీ, విశ్వనాథ ఋష్యశృంగుని గూర్చి వ్రాసిన వచనం. ఇక పద్యంలో, ఋష్యశృంగుడు ఏ విధంగా వర్ణింపబడ్డాడో తెలుసుకుందాము.
" ఋష్యశృంగునికి లోకమంటే, జనసంచారమంటే తెలియనే తెలియదు. అగ్నిహోత్రుడు, తండ్రి విభాండకుడు - వీరిద్దరే అతనికి తెలిసిన లోకం. ఇప్పుడు కూడా, బ్రహ్మచర్యాన్ని పాటించటం, అడవిలోకి వెళ్ళి సమిధలు తీసుకురావటం ఈ రెండు పనులే అతని దినచర్య. ఈ ఋషికుమారుడు అడవిని దాటి దూరప్రదేశాలకు పోడు. అతనికి లోభమనేది లేదు. అన్నిటికంటె ఆశ్చర్యకరమైనది, అతనికి స్త్రీ పురుషభేదం తెలియదు. "
తండ్రి విభాండకుడు అతడినట్లా పెంచాడు.
ఇప్పుడు ఋష్యశృంగుని కథలో కీలకమైన పూర్వరంగాన్ని పరిశీలిద్దాము.
అంగదేశాన్ని రోమపాదుడనే రాజు పరిపాలిస్తున్నాడు. దశరథుడు తన కుమార్తె శాంతను ఆయనకు దత్తత ఇచ్చాడు. అంగదేశంలో ఒకసారి భయంకరమైన అనావృష్టి ఏర్పడింది. చెరువులు, వాగులు, వంకలు, నదులు ఎండిపోయి, భూమి బీటలు వారింది. గ్రాసం లేక పశువులు చచ్చిపోయినాయి. ప్రజలందరూ రాజు దగ్గర మొరబెట్టుకున్నారు. రోమపాదుడు ఎంతో బాధపడ్డాడు. మంత్రులను, పురోహితులను సంప్రదిస్తే, వారు, స్త్రీ పురుషభేదం తెలియకుండా, తండ్రి కనుసన్నల్లో పెరుగుతున్న ఋష్యశృంగుడిని అంగదేశానికి ఏదో విధంగా తీసుకురాగలిగితే, దేశం మళ్ళీ సస్యశ్యామలమౌతుందని మంత్రులు సలహా ఇచ్చారు. కానీ, అతడిని అంగదేశానికి తీసుకురావడానికి ఎవరూ సాహసించలేదు.
ఇంతవరకు చెప్పిన ఈ కథంతా శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, ఇష్టి ఖండములో ఉంది.
No comments:
Post a Comment