ఆదిని బంధహేతు వయినట్టివి సంగతమోహకోపకా
మాదులు త్రుంచికోను నిను నాశ్రయమంది త్వదర్థమైన వీ
వాదములం దగుల్కొనుచు వాదసమాగత మోహకోపకా
మాదులచేతఁ గట్టుపడునట్టులఁ జేయకువే ! మనఃపతీ !
" పరమేశ్వరా ! మోహం, కోపం, కామం మొదలైనవి బంధహేతువులు. అనగా, ఈ సంసారానికి, విషయ వ్యాపారాలకు కట్టిపడవేసేవి. వాటిని పోగొట్టుకొనడం కోసం, నిన్ను ఆశ్రయించి, వాటికి సంబంధించిన వాదనలలో తగులుకొంటూ, ఆ వాదనల వల్ల పుట్టే మోహం, కోపం, కాపం మొదలైనవి వాటివల్ల కట్టుపడేటట్లు చేయవద్దు. "
కట్టుకొయ్యకు కట్టబడిన పశువు, తాడును త్రెంచుకుందామని కట్టుకొయ్య చుట్టూ తిరుగుతుంది. ఈ తిరగడంలో ఇంకొక రెండు చుట్లు ఎక్కువ వేసుకుంటుంది. సంసారజీవుల పరిస్థితి అదే. జీవుడు మొదట, మోహం కోపం, కామం మొదలైన గుణాల నుండి విడిపడాలని భగవంతుడిని ఆశ్రయిస్తాడు. ఆశ్రయించిన తరువాత, వాటికి సంబంధించిన, అనగా, మోహ, కోప, కామాదులకు సంబంధించిన వాదనలలో తగులుకుంటాడు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఈ వాదనలు చేయటం వల్ల, మళ్ళీ అవే మోహం, కోపం, కామం మొదలైన గుణాలకు లోనవుతారు. ఈ మోహకోపకామాదులకు కట్టుబడితే, ఇక విముక్తి యెప్పుడు? అందువల్ల, విశ్వనాథ, తనను ఆ ప్రమాదం నుండి తప్పించమని వేడుకుంటున్నారు.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, ధనుస్ ఖండము లోనిది.
No comments:
Post a Comment