నన్నదిలేదు మున్నెఱిఁగి యాడుట యెట్టులు? నీదు క్ష్వేడముల్
విన్న చెవుల్ బడల్వడఁగ వెక్కసపాటయి కూడ, నింతలోఁ
తున్నది నేను నీ పటిమయు న్నిజ మింత యెఱుంగలేమికా !
ధాతయు నిన్నువంటి సముదారభుజాపరిపాకదీపనో
పేతమహోనిధానమును బృధ్వితలంబున సృష్టిచేసి క
ట్టా ! తగువాని శౌర్యప్రకటత్వము కోసము సృష్టిచేయునే
కా తగునెవ్వఁడో వెదకఁగావలె నెచ్చట నుండియుండునో.
అదికాదు నే నదెప్పుడు
విదితంబుగఁ జెప్పికొనఁగ వినుటయె కానీ
కదలి చనలేద యిట, క
నాది కా దాతనిఁ దుషారనగపరమేశున్.
అతఁడు బలశాలి యందుర యౌషధీ స
మూహముల చేతనేకాక మొదలులేని
మంచుచేఁగూడ బిగిసిన మల్లుఁడందు
రట్టి బిగువు గలానిపై నరుగవలయు.
" అల్పు డెపుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను " అన్నాడు సుమతీ శతకకారుడు. నిజమే ! మూర్ఖత్వం ముదిరిపోయిన దున్నపోతు రాక్షసుడు దుందుభికి అది తెలియటంలేదు కానీ, సముద్రుడికి తెలుసు. సముద్రుడి మీద కాలు దువ్వి యుద్ధానికి రమ్మని, అంతగా కావాలంటే అల్లుడు విష్ణువును సాయం తెచ్చుకోమని పళ్ళు బయటపెట్టి కహ కహ నవ్విన దుందుభికి, పిచ్చి బాగా ముదిరిపోయిందని సముద్రుడు అర్థం చేసుకొన్నాడు. అయినా భయపడుతున్నట్లు నటిస్తూ (పాపం, ఏడిపిస్తున్నాడని తెలియదు దుందుభికి), ప్రశాంతవదనంతో, సముద్రుడు ఇలా అన్నాడు.
" ఓ రాక్షసరాజా ! నే నెప్పుడూ నిన్నొక మాట అన్నదిలేదు. నీ సంగతి తెలిసి కూడా నేనట్లా మాట్లాడతానని ఎలా అనుకున్నావు? ఇంత లోతున్న నేను నీ బలం లోతు తెలియని వాడినా ?
బలపరాక్రమాలున్న నీ అంతటివాడిని సృష్టించిన బ్రహ్మ నీకు సమ ఉజ్జీని ఎక్కడో అక్కడ సృష్టించే ఉంటాడు. కాకపొతే, ఓపికగా వెతకాలి. అంతే ! అది సరే, వాళ్ళూవీళ్ళూ చెప్పుకొంటూ ఉంటే, వినటమే కానీ, నేనిక్కడనుంచి ఎప్పుడన్నా కదిలానా, చూసానా? ఎవరో, హిమవత్పర్వతమట ! మహాబలశాలట. అతడి దగ్గర ఔషధాలుండటం వల్లనే కాదు, శరీరం మొత్తం మంచుతో బిగదీసుకొని ఉండటం వల్ల కూడా, అతనికంత బల మొచ్చిందంటారు. ఇదిగో ! వెళ్తే, అటువంటి వాడి మీదికి వెళ్ళాలయ్యా ! వెళ్ళాల్సిన దారి తెలుసు కదా ! "
అంతా నిజమే ననుకున్నాడు దున్నపోతు.
" సరిగా ఉత్తరం వైపే కదా ! " అని పరుగుదీయటం మొదలుపెట్టాడు.
అల్పులైన వారి సంగతి ఇట్లా ఉంటుంది. సముద్రుడికీ, వీడికీ పోలి కెక్కడ ? " అయినా, చేతకానివాడివి ఎందుకంతంత ఎత్తున ఎగిరిపడతావు అనగానే, కెరటాలను ఒడ్డున విరుచుకున్నాడట సముద్రుడు. గంభీరంగా ఊండేవాళ్ళ సహజ గుణమది.
ఒకింత హాస్యాన్ని మేళవిస్తూ చెప్పిన ఈ సన్నివేశం, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండంలో ఉంది.
No comments:
Post a Comment