ఇంతగఁ గార్యసాధన మహీయము మార్గము వచ్చి నూలు పో
గంత వ్యతిక్రమం బెసఁగునట్లుగఁ జేసినఁ దొందరించి వే
గింతటి మటన్నచో మొదటికిం జెడు సర్వము రామకార్యపు ష్పాంతమునందుఁ జెట్టపురుగై తొడిమన్ దినురీతి నయ్యెదన్.
లంకాపట్టణం చేరిన హనుమ సీతాన్వేషణ ప్రారంభించాడు. కోట అగడ్త దగ్గర భయంకరాకారంతో కాపలా కాస్తూ ఉన్న ఒక రాక్షసిని చూశాడు. ఇక కోటగోడలు, వేలయేండ్ల నుండి సముద్రము అలల తాకిడి చేత బాగా పాచి పట్టి, ఈగ వ్రాలినా జర్రున జారిపోయేటట్లున్నాయి. ఆయుధధారులైన దైత్యభటులు నిరంతరం కాపలా కాస్తున్నారు.
హనుమ బుద్ధిమదగ్రగణ్యుడు. కొంచెం ఆలోచించాడు. తన నిజరూపంతో వెళ్తే భయపడి గోలచేస్తారని, చిన్నదేహంతో, రహస్యంగా వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఇక ఎప్పుడు వెళ్ళాలా అని అలోచించాడు. రాక్షసభటులు అటూఇటూ తిరుగుతున్నారు. ఆ సమయంలో వెళ్తే, పని పాడయిపోతుంది. బాగా చీకటి పడిన తరువాత వెళ్దామంటే, ఆ చీకటిలో ఏమీ కనపడదు. అందుకనే, కొంచెం ప్రొద్దు పోయిన తరువాత వెళ్ళాలనుకొన్నాడు. అదను చూసుకొని పనులు చేయాలని మనసులో అనుకొన్న హనుమ, తాను చేయవలసిన పని యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ విధంగా తలపోశాడు.
" ఇంత క్లిష్టమైన పనిని జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి, నూలు పోగంత తేడా వచ్చేటట్లు, తొందరపడి శీఘ్రంగా చేద్దామనుకొంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. రామకార్యమనే పువ్వు చివరలో చేరి తొడిమను తినే చెడ్డపురుగులాగా మిగిలిపోతాను. "
ఇదీ కార్యసాధకుని లక్షణం. తొందరపడకూడదు. పని మీద శ్రద్ధ ఉండాలి కానీ, ఎప్పుడెప్పుడు పూర్తి చేసి యజమాని మెప్పు పొందాలా అని చూడకూడదు. కార్యసాఫల్యత మీద దృష్టి కేంద్రీకరించాలి. హనుమంతుడి గుళ్ళో ప్రదక్షిణాలు చెయ్యడమంటే హనుమంతుని బుద్ధిసూక్ష్మతను అలవరచుకోవటమే కానీ, ప్రదక్షిణాల సంఖ్యను లెక్కపెట్టుకోవటం కాదు. ప్రాతఃస్మరణీయులు, కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గారన్నటు, జపమాలలోని పూసలను లెక్కపెడుతూ జపం చేసేవాడికి, జపమాల లోని పెద్దపూస మీద ధ్యాస తప్పితే, భగవంతుడి మీద మనస్సు లగ్నమయ్యే దెక్కడ?
మననం చేయదగిన ఈ పద్యం, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండములో ఉంది.
No comments:
Post a Comment