జనమందున్ శరభంగు నాశ్రమము నా సన్మౌని మీ కెల్ల శో
భనముల్ గూర్చెడు స్వామి ! నా సుకృతముల్ పండెం జుమీ ! నీవు చే
యని దా తండ్రికి నాకుఁ జేతు పరకర్మారంభముల్ బిడ్డవై.
శ్శ్వభ్రంబందున నన్నుఁ బూడ్చవె రఘుస్వామీ ! సదా దైత్యలో
కభ్రాజిష్ణుపథంబు నియ్యదియె యో కంజాక్ష ! నీ పాదయు
క్త్యభ్రేషంబుగ నా గళంబుపయి నీవారోపణంజేయు ! ధ
ర్మభ్రంశంబున కడ్డుపెట్టు, పద మస్మత్కంఠముం జేర్చుచున్.
విరాధుడు, శస్త్రాస్త్రాల చేత చావు లేకుండా, ఖండింపబడకుండా, విభజింపబడకుండా, బ్రహ్మనుండి వరాలు పొందాడు. రామలక్ష్మణులను తన శాపావసానం చేసే వారినిగా గుర్తుపట్టి, వారికి తన వృత్తాంతమంతా చెప్పాడు. విరాధుడు రామలక్ష్మణులతో ఇలా అన్నాడు.
" ఘనులైన రామలక్ష్మణులారా ! మీరు యీ దారి వెంబడి పోతే, అర్థయోజనం దూరంలో మీకు శరభంగుని ఆశ్రమం కనిపిస్తుంది. ఆ మహాత్ముడు మీకు శుభాన్ని కలిగిస్తాడు. నా పుణ్యం పండింది సుమా ! నీ తండ్రికి చేయని ఉత్తరకర్మలు, బిడ్డవై ఇప్పుడు నాకు చేస్తావు.
తండ్రీ, రఘుస్వామీ ! నన్ను గుంటలో పూడ్చిపెట్టు. ఎప్పుడూ దైత్యలోకాన్ని ఉద్ధరించే మార్గం ఇదే. నీ రెండు కాళ్ళనూ నా గొంతు మీద పెట్టి నొక్కి, మెడవరకు చేరుస్తూ, గుంటలో పూడ్చిపెట్టు. ఆ విధంగా ధర్మభ్రంశానికి అడ్డుకట్ట వెయ్యి. "
విరాధుడు రామునికి తనను ఏ విధంగా అంతమొందించాలో, శావవిముక్తి ఎలా కలుగుతుందో చెప్పి, తన దీర్ఘనిరీక్షణకు సార్థకత కల్గించుకున్నాడు. అంతేకాదు, భగవంతుని చేతుల మీదుగా ఉత్తరకర్మలను జరిపించుకోవాలనుకోవడం అతని పూర్వజన్మ సంస్కార ఫలము. అందుకే, " నా సుకృతముల్ పండెం జుమీ ! " అని పలికాడు.
ఇంకొక విషయం. విరాధ వధ ఎంత కష్టమైనదో ధ్వనించే విధంగా, విశ్వనాథ ఈ సన్నివేశంలో చాలాచోట్ల దుష్కరప్రాస నుపయోగించి పద్య రచన చేశారు. ఇది మహాకవులకే సాధ్యం.
ఈ సన్నివేశం, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనిది.
No comments:
Post a Comment