నినుపారన్ మముఁబంచునాఁ డపుడు దీనింగూర్చి కాఁబోలుఁ జే
ప్పెను సుగ్రీవుఁడు సిం హికాఖ్య యిది దర్వింగూర్చి వేల్వంగనై
తననీడే తనుఁబట్టి మ్రింగుననఁ జేతఃక్లిష్టతం గూర్చెడున్.
మఱియున్ మారుతి క్లుప్తదేహుఁడయి సమ్యగ్వజ్రగాఢాంగ బం
ధురుడై రాక్షసిమోమునం దుఱికెఁ జండుం డా మహాలంఘనో
ద్ధురతన్ రాక్షసిలోని యంగిలి భిదాధూపాయితంబై పొరిం
బొరి నిప్పుందిన నార్చుకొంచుఁ దిననౌపోల్కిన్ దలంపూనఁగన్.
తొడిఁదనయంతఁదానుగనె దూఁకెనొ రక్కసి లాగెనొక్కొ యి
ర్వడి కనుచుండి నేర్వరు సుపర్వులు గాఢవిషణ్ణభావు లే
ర్పడఁ గపిరాజు లోనఁ జని రక్కసి గుండియ వ్రక్కలించి వె
ల్వడె నిముసంబులో దితిజ బాహిరవోయిన ప్రాణమైచనన్.
గుండె యాఁగి చత్తురుఁగాని గుండెలోనఁ
జట్టుపొడియయి చచ్చిన చావులేదు
దానిచచ్చినచావు సంద్రంబునందు
బాములకుఁ దెప్పయైన శవంబుచెప్పు.
సింహిక పెద్ద రాక్షసి. అది సముద్రగర్భంలో ఉంటుంది. అది ఆహారాన్ని వేటాడాలన్నప్పుడు, ప్రాణి నీడను పట్టి లాగితే, ఆ ప్రాణి వచ్చి దాని నోట్లో పడుతుంది. వియత్పథంలో వెళ్తున్న హనుమ నీడను చూసి అది గుంజటం మొదలుపెట్టింది. అప్పుడు, హనుమ ఇలా అనుకొన్నాడు.
" ఆహా ! ఒక రక్కసి నీడ పట్టుకొని లాగుతుందని సుగ్రీవుడు నన్ను పంపేటప్పుడు చెప్పింది దీనిని గురించే అనుకుంటా ! ఇది సింహిక అనే పేరు కలది. నీడను పట్టి సముద్రంలోకి లాగి ప్రాణిని మ్రిగుతుందంటే, దీనిని తప్పించుకోవటం కష్టమైన పని. "
ఇలా అనుకొంటూ హనుమ, ఆ రక్కసి నోటిని ఎంత పెంచితే తన శరీరాన్ని అంత పెంచుతూ వచ్చాడు. అది చూసిన రాక్షసి తన నోటిని పాతాళమంత పెద్దదిగా చేసింది.
" ఇదే అదననుకొన్న మారుతి తన దేహాన్ని కుంచించుకొని, వజ్రసమానమైన దేహంతో, రక్కసి నోటిలోకి ఉరికాడు. దూకటంలోని ఆ వేగానికి, రాక్షసి లోపలి అంగిలి నిప్పుకణికె మ్రింగినట్లయి, దానిని ఆర్చుకొంటూ తినాలన్నట్లుగా ఆలోచన చేయబూనింది.
హనుమ తనంతట తానే రాక్షసి నోట్లో దూకాడా, లేకపోతే, రాక్షసి హనుమను లాగిందా అని ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు తీవ్రమైన విషాదానికి, విస్మయాని లోనయిన మరుక్షణంలోనే, హనుమ లోపలికి వెళ్ళి, ఆ రాక్షసి ప్రాణాలు కడబట్టేటట్లుగా , దాని గుండెను ముక్కలు ముక్కలుగా చేసి, ఒక్క ఉదుటున బయటికి వచ్చాడు.
లోకంలో ఎవరైనా గుండె ఆగి చస్తారు కానీ, గుండె పొడిపొడి అయి చచ్చిన దాఖలా లేదు. సింహిక చచ్చిన చావు ఎట్లా ఉందంటే, దాని శవం, సముద్రంలోని పాములకు తెప్పగా మారింది. "
ఇదివరకు నాగమాతను మెప్పించిన మహాద్భుత చర్య అయినా, సింహిక ను చంపిన తీరయినా, హనుమ యొక్క సూక్ష్మబుద్ధిని తెలియజేస్తున్నాయి.
విశ్వనాథ, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండం లోని యీ సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రించారు.
No comments:
Post a Comment