శాస్త్రమునకును రెండు పక్షములుకలవు
కావ్యపక్షము శాస్త్రపక్షమ్మటంచు
కావ్యపక్షమ్మునన్ బ్రయోగమ్ములున్ స
మర్థ్యములు కవిప్రతిభా సమంచితములు.
నాది వ్యవహారభాష మంథరము శైలి
తత్త్వము రసధ్వనులకు బ్రాధాన్యమిత్తు
రసము పుట్టీంపగ వ్యవహారము నెఱుంగ
జనును లోకమ్మువీడి రసమ్ములేదు.
శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారిక లోని ఈ రెండు పద్యాలు విశ్వనాథ యొక్క కావ్యరచనా పద్ధతిని తెలియజేస్తున్నాయి.
కవిత్వపరంగా నియమ నిబంధనలను సూచించే శాస్త్రగ్రంథాలకు, కావ్యపక్షము, శాస్త్రపక్షము అని రెండు ధోరణు లున్నాయి. అందులో, కావ్య పక్షములో కవి యొక్క ప్రతిభతో కూడిన ప్రయోగాలు సమర్థనీయములైనవి.
విశ్వనాథ కావ్యపరంగా, తన భాష వ్యవహార భాష అని, శైలి పరంగా నిగూఢమైనది, వక్రోక్తి అని చెప్పారు. వారు తమ కావ్యంలో, తత్త్వానికి, రసధ్వనులకు ప్రాధాన్యమిస్తానన్నారు. కావ్యంలో రసం పుట్టిచాలంటే, లోకవ్యవహారం తెలియాలనీ, లోకాన్ని వదిలిపెడితే రసం లేదనీ విశ్వనాథ ప్రగాఢ విశ్వాసం.
No comments:
Post a Comment