ఆ లెక్కం జనఁగా మరుత్సుతుఁడు తానైలంకలోఁ జొచ్చుచోఁ
వేళాదుష్టముగాఁ గనంబడి మదిన్ వేల్పుల్ ముహూర్తంబు తా
మాలస్యంబు ఘటింపనెంచి సురసాఖ్యన్ నాగమాతన్ ద్యుతి
వ్యాలోలాగ్ర సహస్రభానుసమ సంప్రార్థించి రాబద్ధులై.
నిన్నుపాయంబుగాఁ దప్పికొన్నసరియె
కాద యేనియు రామ కార్యోదయంబు
నుండి తొలఁగినసరియె వాయుసుతుపటిమ
మే మెఱుంగను గోరుచున్నాము తల్లి.
హనుమంతుడు ఆకాశమార్గంలో సముద్రాన్ని దాటి దక్షిణ దిక్కుగా లంక వైపు ప్రయాణం చేస్తున్నాడు. దేవతలు, ఋషులు భావనాసమాధి స్థితిలో హనుమకు కార్యసాఫల్యం కలగాలని ధ్యానం చేస్తున్నారు. హనుమ పయనించే వేగం చూస్తే, అతడు లంకలో దుర్ముహూర్తంలో ప్రవేశించేటట్లున్నాడు. ఆ సమయాన్ని లెక్కగట్టిన దేవతలు, హనుమ లంకకు ఆలస్యంగా చేరేటట్లు ప్రణాళిక రచించారు. వారు, వేయిసూర్యులకాంతితో ప్రకాశించే సురస అనే నాగమాతను ఇలా ప్రార్థించారు.
" అమ్మా ! హనుమ అని వాయుదేవుని కుమారుడున్నాడు. ఆయన సముద్రాన్ని దాటి లంకకు వెళ్తున్నాడు. కొంచెంసేపు నీవు భయంకరాకారం ధరించి, ఆయన శత్రువులాగా వ్యవహరించి, ఆయనను ఆపు, అడ్డగించు. వాడి కోరలు, పదునైన దంతములతో కూడిన నీ ఘోరమైన ముఖద్వారం నుండి ఆయన తెలివిగా ఎట్లా తప్పించుకూంటాడో చూడాలని ఉంది. త్వరగా వెళ్ళమ్మా ! ఉపాయంగా నీ నుండి తప్పించుకున్నాడా సరి. లేకపోతే రామకార్యం నుండి వైదొలగినా సరే. అసలు ఆ వాయుసుతుని శక్తిసామర్థ్యా లేమిటో తెలుసుకోవాలనుందమ్మా ! "
లోకంలో, నలభై రోజులపాటు హనుమంతుని గుడిలో ప్రదక్షిణం చేయటం, సుందర కాండము పారాయణం చేయటం అందరికీ తెలిసిన విషయమే. ఇది మంచిదే. దానితో పాటు, సుందర కాండములో హనుమ ప్రదర్శించిన బుద్ధివిశేషాలను, సునిశిత వివేచనా శక్తిని, సూక్ష్మగ్రాహ్యతను అలవరచుకొనడమే పైన చెప్పిన కార్యక్రమాల పరమార్థం. హనుమంతుని సునిశిత బుద్ధి విశేషం బహిర్గతమైన సన్నివేశాల్లో సురసను ఉపాయంగా తప్పించుకొని పోవటం ఒకటి.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండములో ఉన్నాయి.
No comments:
Post a Comment