బ్బురముగ నెందఱో చెదలుపుట్ట సదా భజనల్ పొనర్చుచుం
దురు, దురుపాధి వానికిని దోచును దా భగవంతుఁ డైనటుల్
హరహర ! లోకమెంత తనయంతటఁ దాఁ గికురించుకోనగున్.
రావణుని మనస్సులో రాముడిని గూర్చి అంతర్మథనం ప్రారంభమైంది. తన దైవమైన శివుడు, అడవులు పట్టివచ్చిన రామునికి బాసటగా నిలవటమేమిటని ఆశ్చర్యపడ్డాడు.. అసలు, రాముడు మానవుడా లేక ఎవరన్నా అంతకు మించినవాడా అని కూడా అనుకున్నాడు. " తన కోసమని యీ వానరసైన్యమంతా ప్రాణాలర్పిస్తే, రేపు ప్రొద్దున ఆ కట్టెవంతెన మీద జయపతాకాన్ని నాటుతాడా? " అని కూడా వితర్కించుకొన్నాడు. " లోకాన ఇంకెవరూ స్త్రీలు లేనట్లు, సీత కోసం వచ్చాడని, వచ్చిన వాడు ఏమన్నా మహాసైన్యాన్ని తీసుకొచ్చాడా అంటే, కోతులమూకను వేసుకొచ్చాడని, ఎవరన్నా వింటే నవ్విపోతారని ", లోపల గుడుసుళ్ళు పడటం మొదలుపెట్టాడు. కార్తవీర్యార్జునుడిని చంపిన పరశురాముడిని యుద్ధం కాని యుద్ధంలో గెలిచి, అదేరకంగా రావణుడిని కూడా చంపాడన్న కీర్తిని పొందాలన్న దుర్బుద్ధితో రాము డున్నాడని చిత్రమైన ఆలోచన చేశాడు. రావణుడు ఇంకా ఇలా తలపోశాడు.
" ఎవడో ఒకడు తాను భగవదంశతో పుట్టానని చెబుతాడు. ఇక వాడి చుట్టూ చెదలపుట్టల్లాగా జనాలు చేరి భజనలు చేయటం మొదలుపెడతారు. దురుపాధిలో ఉన్నటువంటి ఆ జీవుడికి కూడా తాను నిజంగా భగవంతు డన్నట్లుగా అనిపిస్తుంది. శివ శివ ! లోకం తనను తాను ఎంత మోసం చేసుకుంటుందో కదా! "
రావణుడు ఈ విధంగా వితర్కించుకొనడానికి బలమైన కారణం రాముడు శ్రీమహావిష్ణువు యొక్క అవతారమా అన్న సంశయం అతడిని వేంటాడుతూనే ఉంది.
ఇక లోకం తీరును పరిశీలిస్తే, ఈ భగవంతులమని ప్రకటించుకొనే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. దానికి తగ్గట్లు భజన బృందాలు కూడా చెదలపుట్టల లాగా పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ విధంగా విశ్వనాథవారి పద్యం వాస్తవ వర్తమాన పరిస్థితులకు అద్దం పడుతున్నది.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము
లోనిది.
No comments:
Post a Comment