టా నీరాకరమున్ హిమాద్రియును నిన్నాడంగ నిన్ దీవ్రశృం
గానన్ దూయఁగ నూహచేసితిని నాకంటెన్ బలాఢ్యుండటం
చీ నేలం గలఁడొక్కరుండనేదు పల్కే నోర్వఁజుమ్మీ ! కపీ !
హిమశైలంబఁట తాను కాదఁట సరేలే ! యంచు నేనేగ
నా హిమశైలానికిఁ జీమునెత్తురులు లేవేమందు నిల్వేల్ల ర
క్తము లేనట్లుగఁ బాలిపోయె నిఁక నాకా ! వీనితోనా ! రుజా
శ్రమ తీర్పంగను శాంతులున్ వ్రతములున్ సంతర్పణల్ తీర్పఁగా.
మూలనున్న యట్టి ముసలమ్మఁ గొట్టెను
సాగి యాఱునెలలు సాముచేసి
యన్న యట్లుగాఁగననుకొంచు నుండంగ
నతఁడు నిన్ను జెప్పెనంతనంత.
హిమవంతుడు భయాన్ని నటిస్తూ, దుందుభిని వాలి మీదికి ఉసిగొల్పాడు. వాడు మూర్ఖుడు కదా, సరాసరి కిష్కింధాపురిలో, వాలి దగ్గర వాలాడు. ఆ రోజు పున్నమి రాత్రి. వీడు అమావాస్య దాడిచేసినట్లు, కిష్కింధపురి కోటద్వారాన్ని కొమ్ములతో తాడించాడు. ఆ మహాధ్వనికి, తార అందిస్తున్న మధుపాత్ర జారి కాళ్ళపై ఒలికింది. దానితో, వాలికి కొత్త వేడి తలకెక్కింది. వాలి ఒక్క ఉదుటున దుర్గద్వారానికి లంఘించి, అడ్డంగా ఉన్న రాయిని తొలిగించి, ఎవడురా అంటూ, పెద్దగా కేకపెట్టాడు. ఎదురుగా ఆవులించిన దక్షిణ దిక్కులాగా, అగ్నిశిఖల వంటి జుట్టుతో, నల్లని దున్నపోతు ఆకారంలో ఉన్నాడు దుందుభి. వంద కాగడాల వెలుతురులో, అంతటి తెల్లని వెన్నెలా ఎఱ్ఱగా మారింది. అలా వికృత భయంకరాకారుడై నిలుచున్న దుందుభి వాలితో ఇలా అన్నాడు.
" నువ్వేమో మహాబలుడివట. నీ పరాక్రమానికి భూమ్యాకాశాలు పట్టవని ఆ సముద్రుడు, హిమవంతుడు చెబితే, నిన్ను నా వాడి కొమ్ములతో పొడిపొడి చేద్దామని వచ్చాను. నాకంటె ఇంకొకడు బలాఢ్యుడు ఉన్నాడనే మాటే నాకు పడదు సుమా !
నేనా సముద్రుడి మీదికి వెళ్ళి హుంకరించే సరికి, వాడు గజగజ వణికిపోయాడు. నేనేమో దుస్సహమైనటువంటి నా శౌర్యానికి గుర్తుగా తెల్లని భూభాగాన్ని చాళ్ళుచాళ్ళుగా దున్నిపారేశాను. అప్పుడు ఆ ప్రాంతమంతా ఉప్పుమళ్ళుగా మారి సముద్రుడు పాదాక్రాంతుడయ్యాడు. సముద్రుడు నాకు సమ ఉజ్జీ కాదని, హిమవంతుడి పేరు చెప్పాడు.
ఇక హిమవంతుడి సంగతి సరేసరి. వాడికి చీమునెత్తురు లేవు. అసలు ఒంట్లో రక్తం లేనట్లు నిలువునా పాలిపోయినట్లున్నాడు. ఇక వాడితోనా నేను యుద్ధం చేసేది? ఆ ఔషధాలయంలో (హిమవత్పర్వతం ఔషధ మూలికలకు నిలయం) శాంతులు, వ్రతాలు, సంతర్పణలు చక్కగా చేసుకోవచ్చు. "
హిమవంతుడితో యుద్ధం అంటే, ఆరు నెలలు బాగా సాము చేసి, చివరికి మూల నున్న ముసలమ్మను కొట్టినట్లుగా ఉంటుందని అనుకుంటుండగా, హిమవంతుడు నిన్ను గురించి చెప్పాడు. "
వాలి మహాబలశాలి. కార్త్రవీర్యార్జునుడిని, రావణుడిని మూడు చెరువుల నీళ్ళు తాగించినవాడు. దుందుభి అటువంటి వాలిని కవ్విస్తున్నాడంటే, వాడెంత దున్నపోతో అర్థమౌతుంది. సముద్రుడు గంభీరమైనవాడు, లోతైనవాడు. హిమవంతుడు ఉన్నతుడు. వాళ్ళు తగ్గి మాట్లాడారంటే, అది వాడిని ఏడిపించటానికి, మూర్ఖులతో మన కెందుకులే అన్నది ఒక కారణమైతే, ఎటూ వాలి వాడి పీచ మణుస్తాడన్నది ఇంకొకటి.
ఈ రసవత్తర ఘట్టం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండము లోనిది.
No comments:
Post a Comment