జ్జ్వలతఁరుడేను జంతుతతిజన్మలు భ్రాంతులు చావులన్నియుం
దెలిసియు బిట్టుచీఁకటుల తెన్నున బొప్పెలు కట్టుచుండె నీ
వెలుతురులోనికిం గొనుచువెళ్ళవె ! మౌళిశశాంకరోచిషా !
ఇది, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, మునిశాప ఖండంలో చివరి పద్యం. సంసారజీవుల వేదనను తెలియజేసే ఈ పద్యాని కిదే సాటి.
" ఓ చంద్రశేఖరా ! ఈ లోకంలో అందరూ తెలిసిన మూఢులే. వారందరిలోను, శ్రేష్ఠుడిని నేను. ప్రాణుల జననమరణాలు, నడిమి మాయసంసారం, అన్నీ తెలిసి కూడా, చీకటిమార్గంలో వెళ్ళి, నెత్తికి బొప్పెలు కట్టించుకుంటున్నారు. కరుణించి, వారిని నీ వెలుతురు లోనికి తీసుకువెళ్ళు. "
ఎంత మేర చీకటిగా ఉంటే, దానికి తగ్గట్లుగా అంత వెలుతురు నిచ్చే దీపం తీసుకొని వెళ్ళటం లోకంలో సహజంగా జరిగే పని. కానీ, ఎటు చూసినా, పెనుచీకటైతే, ఎంత పెద్ద దీపం ఆ చీకటిని పోగొట్టగలదు? ఈ విశ్వంలో అంతటి వెలుగును ప్రసాదించే వాడున్నాడా? ఉన్నాడు. ఆయనే మౌళిశశాంకరోచిషుడు. తలపైన చంద్రుడిని ధరించి, వెలుగును విరజిమ్మేవాడు. చంద్రుడు అమృతాంశుడు. మరి ఆ చంద్రుడిని శిరస్సుపై ధరించినవా డెంతటి అమృతమయుడై ఉండాలి? అందుకనే, ఆయనను ఆశ్రయించటం.
విశ్వనాథ ప్రయోగం లోని ఇంకొక విశేషం. " జంతుతతి జన్మలు భ్రాంతులు చావులన్నియుం దెలిసియు " అన్నారు. జన్మలకు చావులకు మధ్య భ్రాంతిని పెట్టారు. అంటే, జననమరణాల మధ్య నున్న సంసారం వట్టి భ్రాంతి, మాయ, అని అర్థమౌతున్నది కదా! తెలిసి తెలిసీ మాయలో పడుతున్నారు కనుకనే , సంసారజీవులను తెలిసిన మూఢు లన్నది.
No comments:
Post a Comment