నాకంటెన్ మును పైన భక్తుఁడటె యీ నాళీక బంధన్వయుం
డాఁకొన్నాడు శివుండు దంపతుల మధ్యన్ వార్తలందింపగా
క్ష్మా కన్యాపతి యింతదాఁకను బహిశ్శత్రుండె యీనాఁటి కిం
దాఁకన్ వచ్చినయంతఁ గన్పడియె నంతశ్శత్రుతాస్థానమై.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోని హంసదౌత్యము, కథాపరంగా రావణుని మనస్సులో ఒక సంశయబీజాన్ని నాటటానికి, తదనంతర కాలంలో అది " ఇది నారాయణమూలమౌ తరువు " అన్న ఆకారాన్ని దాల్చటానికి, వస్తుసామాగ్రిగా ఉపకరించింది.
అశోకవనంలో, ఏ చెట్టుకొమ్మ మీద కూర్చొని హనుమ రావణుని ప్రేలాపనలు విన్నాడో, సరిగా అదే చోట హంస కూర్చున్నది. విద్యున్మాలి చేత కల్పింపబడిన రామలక్ష్మణుల మాయాశిరస్సులను, ధనుర్బాణాలను, తరువాత అవి అదృశ్యమవటాన్ని హంస చూసింది. తాత్కాలికంగా దుఃఖానికి గురైన సీతకు రాముని సందేశాన్ని వినిపించి, దుఃఖోపశమనం కలిగించింది. ఇదంతా గమనించిన రావణునికి, పూజామందిరంలో హంస రూపంలో తన పూజలందుకొంటున్న శివుడే, ఇక్కడ మళ్ళీ సీతారాముల మధ్య రాయబారాన్ని నడుపుతున్నాడా అని అనుమానం కలిగింది. దానితో, అతడికి హంస మీద కోపమొచ్చి ఇలా అన్నాడు.
" శివుడు ఈ విధంగా, దంపతుల మధ్య వార్త లందించటానికి, రాముడేమన్నా నాకంటే ముందు భక్తుడయ్యాడా? రాముడిని ఇంతవరకు బయటి శత్రువని అనుకున్నాను. ఇప్పుడు పరిస్థితి ఇంతదాకా వచ్చింది కనుక, ఇప్పుడు లోపలి శత్రువుగా కూడా మారాడు. "
రావణుని మాటలు చాలా లోతుగా విశ్లేషణ చేయదగ్గవి. బయటి శత్రువును ఎదుర్కొనటం సులభం. కానీ, మనవాడనుకున్నవాడు శత్రువుగా మారితే, ఆ పరిస్థితిని ఎదుర్కొనటం చాలా కష్టం. ఇన్నాళ్ళు తాను శివుని యొక్క మహాభక్తుడిననుకొన్న గర్వం, హంసదౌత్యంతో పటాపంచలైపోయింది. ఈ అంతఃశ్శత్రుతాస్థానం గురించే ప్రస్తుతం రావణుడి బాధంతా.
కల్పవృక్షములోని ప్రసిద్ధ పద్యాలలో ఇది ఒకటి.
No comments:
Post a Comment