నలువుగ నమ్ము మచ్చముగ నా పనులం బొనరించుకొంట కే
సలుపుఁగలేదు నీ దయిన సఖ్యము నీదగు సఖ్యమన్నచోఁ
డెలియనివాడఁగా నదియు దేవతలైనను బొందలేరు నా
తొలుతటిజన్మలన్ ఫలముతోఁచుట యియ్యది లక్ష్మణాగ్రజా !
నా రఘురామ ! నా యెడల నమ్మకముండిన మైత్రి సాగ ని
మ్మూరక వట్టిమాటలని యుల్లమునందునఁ దోచెనేనియున్
నీ రమణీ గవేషణము నీవును దమ్ముఁడు చేసికొండు నా
వైరము తీర్చిపెట్టుటకు వచ్చితివా ! యటవీప్రదేశముల్.
అనిన రాముడు చాలులేవయ్య సఖుడ !
మన ప్రతిజ్ఞలు నా కష్టమునకు నీవు
నేను నీ కష్టమునకు నీ వెఱుఁగవు
నతని నే నెఱుంగ నన్న నర్థమేమి.
నీకేమొ మంచిదినములు
రాకుండగఁ జేసిపెట్టు రా ముందర నీ
నా కార్య మనువు నెవ్వఁడ
యా కోరెడు నిన్ను నిట్టి ప్రాంచితశీలున్.
సీతాపహరణం చేసిందెవరో చెబితే, వాడి శరీరంలోని మాంసఖండాలు పెకిలించి, రక్తం జల్లించి, బాణాలతో తూట్లుతూట్లుగా చేస్తానని రాముడు సుగ్రీవుడితో అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు దీనంగా ముఖం పెట్టి, వాడెవడో తెలియదన్నాడు. సీతను ఎవడు అపహరించాడో, ఎక్కడ దాచాడో తనకు తెలియదని, సరియైన సమయంలో వానరసైన్యాన్ని పంపించి, సీతను వెదికించి, రాముడికి అప్పగించకపోతే, తనను సుగ్రీవుడని పేరుతో పిలువ వద్దన్నాడు. సుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు.
" రామా ! నన్ను నమ్ము. నా పనులను చేయించుకోవటానికి నీతో స్నేహం చేయలేదు. నేను నీ స్నేహం విలువ తెలియని వాడినేమీ కాదు. నీ వంటివాని స్నేహం దేవతలైనా పొందలేరు. నా పూర్వజన్మల పుణ్యఫలం వల్ల యిది సాఫల్యమైంది.
నా మిత్రమా, రఘురామా ! నా మీద నమ్మకముంటే యీ స్నేహాన్ని కొనసాగిద్దాము. నావి వట్టి మాటలని నీ కనిపిస్తే, సీతాన్వేషణ, నీవు, నీ తమ్ముడు చేసుకొనండి. నా వైరాన్ని తీర్చటానికి మీరు వనవాసానికి రాలేదు కదా ! "
ఈ మాటలు విన్న రాముడు, సుగ్రీవుడు మనసులో నొచ్చుకున్నాడన్న సంగతి గ్రహించి, ఇలా అనునయించాడు.
" చాల్లేవయ్యా మిత్రుడా ! మనం, మన ప్రతిజ్ఞలును. నా కష్టానికి నువ్వు, నీ కష్టానికి నేను, ఒకరికొకరం తోడు. సీతను ఎత్తుకుపోయిన వాడెవడో, నీకు గానీ నాకు గానీ తెలియదంటే, అది విధిప్రేరితంగా జరిగిందని అర్థం.
ఇంకొక సంగతి. నీ కష్టాలు తీరి, నీకు మంచిరోజులు రాకుండా, " రావయ్యా ! ముందు నా పని చేసిపెట్టమని, నీవంటి పూజార్హుడైన శీలవంతుడిని ఎవరు అడగ గలరయ్యా ! "
రామసుగ్రీవుల హృదయసౌశీల్యానికి ఈ పద్యాలు కొలమానాలు. వారి మధ్య మైత్రి దైవ నిర్ణయం వల్ల జరిగింది. అందువల్ల, దానిలో వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యత లేదు. అందువల్లనే, సుగ్రీవునికి మంచిరోజులు రాకుండానే, జానకీగవేషణ చేయటం మిత్రధర్మ మనిపించుకోదని రాముని భావన.
ఈ పద్యాలు, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండములో ఉన్నాయి.
No comments:
Post a Comment