మలి చదువుల్ ఫలించునటె? మానని తర్కము పెంచి పెంచి చం
చలతమమైన బుద్ధి మతిశాలిత యంచనుకోను గాక ! ని
శ్చలతమమైన నీదు పద సారసభక్తి నొసంగవే శివా !
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి బహుజన్మల తపఃఫలం శ్రీమద్రామాయణ కల్పవృక్షము అనే బృహత్కావ్యం. ఆ కావ్యాన్ని వారు పరమేశ్వరునికి అంకిత మిచ్చారు.
కల్పవృక్షము నందలి ప్రతి కాండము ఐదు ఖండములుగా విభజింపబడింది. పరమేశ్వరలబ్ధప్రసాదమైన మానవదేహం పంచభూతాత్మకం. మానవదేహం ఉపాధిగా, నితచైతన్యంతో వెలిగేది ఆత్మ. ఈ ఆత్మజ్ఞానం పొందటానికి లేక స్వస్వరూప సంధానం కలగటానికి జీవుడు పడే వేదనను, విశ్వనాథ కల్పవృక్షము లోని ఖండాంత పద్యాలలో, తెలియజేసారు.
ఇది బాలకాండము, ఇష్టి ఖండము చివరలో నున్న పద్యం. విశ్వనాథ తమ వేదనను ఏ విధంగా తెలియపరుస్తున్నారో చూద్దాము.
" శివా ! తొలిచదువులైన వేదాలు కూడా నీ యదార్థ స్వరూపాన్ని వివరించలేవు. ఇక మలి చదువుల సంగతి చెప్పాలా ? అవి పనికిరాని తర్కాన్ని పెంచి పోషిస్తాయి. అందువలన, శాస్త్రజ్ఞానం వల్ల కలిగే అతి చంచలమైన బుద్ధివిశేషాన్ని, నిన్ను తెలియజేసే యదార్థజ్ఞానం అనుకోను. నిశ్చలంగా నీ పాదపద్మాల మీద కుదురుకొనే భక్తిని నాకు అనుగ్రహించు. "
శాస్త్రపరిజ్ఞానం ఊరకే వాదానికి పనికొస్తుంది కానీ, భగవంతుడిని చేరే మార్గాన్ని చూపించదు. భగవంతుడిని చేరటానికి ఒక్కటే మార్గం. అదే నిశ్చలమైన భక్తి. ఈ విషయాన్ని శంకరభగవత్పాదులు భజగోవింద శ్లోకాలలో చెప్పారు.
No comments:
Post a Comment