తనకుఁబోలెఁ దలలు తఱిగి యిచ్చినవాడు
సృష్టి మొదలు మొదలు చివరిదాక
కానరాఁడు తన్నుఁగాదని యెవనినో
తన్నుఁబోలు జోగి నెన్నుకొనియె.
అయినవారి కేమొ యాకులయందునఁ
గానివారికైనఁ గంచములను
ఇంటిలోనఁదించు నింటివాసంబుల
లెక్కపెట్టు నట్టి లెక్కగాఁగ.
ప్రాగల్భ్యం బెసలార రత్నమువలెన్ రాజోపచారంబుగా
సాగింపన్, సుఖమొప్పగా ననుభవించన్ లేక మిన్నేగె, బై
రాగిం బోలుచుఁ దొంటిలక్షణము మారంబోద, బంగారమున్
మైఁగప్పన్ దొడుగంచు లోపలి శిలామాలిన్య మెందేగెడిన్.
రాజహంస లంకలోని అశోకవనంలో, సీతాన్వేషణకు వచ్చినపుడు హనుమంతుడు ఏ చెట్టుకొమ్మ పైన కూర్చున్నాడో, సరిగా అదే చోట కూర్చున్నది. హంస రాముని సందేశాన్ని వినిపించింది. ఇది చూసిన రావణునికి కోపంతో ఒళ్ళుమండిపోయింది. రావణుడు తనలో ఇలా అనుకొన్నాడు.
" సృష్టి మొదలయినప్పటినుంచి ఇప్పటిదాక, పరమేశ్వరునికి తలలు తరిగి ఇచ్చి, నైవేద్యంగా పెట్టినవాడున్నాడా? అటువంటి నన్ను కాదని, ఎవరో సన్యాసిని పట్టుకు ప్రాకులాడుతున్నాడు. అవునులే ! అయినవారికేమో ఆకుల్లోను, కానివారికి కంచాల్లోను పెట్టటం ఉన్నదేగా ! ఇదెట్లా ఉందంటే, తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లుంది.
ఉట్టిపడేటట్లు, రత్నం లాగా రాజోపచారాలు చేస్తుంటే, ఇంట్లో కూర్చొని హాయిగా అనుభవించక, ఆకాశంలో పచార్లు చేస్తున్నాడు. పూర్వపు బైరాగి బుద్ధి ఎక్కడికి పోతుంది? బంగారపు తొడుగు తొడిగినంత మాత్రాన, రాతికి లోపలున్న మురికి పోతుందా ? "
రావణుని పూజగదిలో ఒక వెండి హంస బొమ్మ ఉంది. దానిని శివునిగా భావించి పూజ చేస్తున్నాడు. ఇప్పుడు అశోకవనంలో హంసను చూడగానే, రావణుడికి, తన పూజాగృహంలోని హంస, సీతారాముల మధ్య రాయబారం నెరపడానికి వచ్చిందా అన్న అనుమానమొచ్చింది..
కల్పనాచమత్కృతితో విలసిల్లే యీ సన్నివేశం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండములో ఉన్నది.
No comments:
Post a Comment