స్ఫురదురుఫాలనేత్రశిఖి బూర్ణతరామలబింబ మొక్కపాల్
గరగె ననంగ నొప్పు శశిఖండము ముందఱ గాగి క్రమ్ము ను
త్కరవర తత్సుధారసము కల్లడి నా దగు జూటపూరితా
మరనది వొల్చె నర్థశశిమండలనిర్జరసింధుమౌళికిన్.
శివుని తలమీద అర్థచంద్ర ఖండము, ఆకాశగంగ, నొసటి మధ్య అగ్ని ఉన్నాయి. శివుడు త్రినేత్రుడు. సూర్యచంద్రాగ్నులు ఆయన మూడు కళ్ళు. నుదుటిపై నున్న అగ్ని శిఖల వేడిచేత, తలపై నున్న నిండు చంద్ర బింబము కరగి, అర్థశశిఖండము వెలుగొందుచున్నదా అన్నట్లున్నాడు. చంద్రునకు అమృతాంశుడని పేరు. చంద్రునిలో స్రవిస్తున్న అమృతరసము పొంగు అన్నట్లుగా, శివుని జటాజూటమునందున్న ఆకాశగంగ ఒప్పారుతున్నది.
రసజ్ఞులైన పాఠకుల " మదికి ఉదాత్త కల్పనల మక్కువ గల్కిన ", మహాకవుల రచనలు " సకలోహ వైభవసనాథములు " అవడములో ఆశ్చర్యమేమీ లేదు.
పార్వతిని పెండ్లాడడానికి ఓషధీప్రస్థపురానికి వచ్చిన పై పద్యంలోని శివుని వర్ణన, నన్నెచోడ మహాకవి రచించిన కుమారసంభవము కావ్యము అష్టమాశ్వాసములో ఉన్నది.
No comments:
Post a Comment