సాత్యవతేయ విష్ణుపద సంభవమై, విబుధేశ్వరాబ్ధి సం
గత్యుపశోభితంబయి, జగద్విదితంబగు భారతీయ భా
రత్యమరాపగౌఘము నిరంతర సంతత పుణ్య సంపదు
న్నత్యభివృద్ధి సేయు వినినం గొనియాడిన నెల్లవారికిన్.
నన్నయగారి మహాభారతావకారికలో యిది చాలా ప్రసిద్ధమైన పద్యం. ఇందులో వాడిన విశేషణాలకు భారతము పరంగాను, గంగానది పరంగాను అర్థం చెప్పుకోవాలి.
ముందుగా, భారతము పరంగా చూద్దాము. మహాభారతము సత్యవతీ పుత్రుడైన, నారాయణాంశ కలిగిన, వ్యాసుని వాక్కు నుండి పుట్టినది. పండితులనే సాగరము యొక్క స్నేహమనే కలయిక చేత ప్రకాశిస్తున్నది. విశ్వవిదితమైన ఇటువంటి భారతము యొక్క వాక్స్వరూపం, వినినా, ప్రశంసించినా, ప్రతివారికీ, విశేషమైన పుణ్యసంపదను కలిగిస్తుంది.
ఇక గంగానదీ పరమైన అర్థము. విష్ణుపాదోద్భవ అయినట్టిదీ, దేవతల రాజైన దేవేంద్రునికి సంబంధించిన సముద్రము యొక్క సంగమము చేత ప్రకాశించినట్టిదీ అయిన, గంగానదీ ప్రవాహము గురించి, పౌరాణికులు చెప్పగా వినినా, పొగిడినా, అది ఎల్లవారికీ, విశేషమైన పుణ్యాన్ని కలుగజేస్తుంది.
నన్నయగారి " నానారుచిరార్థసూక్తినిధిత్వము " అనే లక్షణానికి యీ పద్యము చక్కని ఉదాహరణము. ఈ పద్యానికి సంబంధించినంతవరకు, రుచిరార్థసూక్తినిధిత్వము అంటే, రుచిరమైన అర్థము, మంచి అర్థము, అని చెప్పుకోవాలి. ఇక రెండవ విషయము, ఈ పద్యంలో, మహాభారత పరంగాను, గంగానది పరంగాను అర్థద్వయాన్ని అన్వయించడంలో ఒక ఔచిత్యం ఉన్నది. తూర్పు చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని రాజ్యము, అనగా వేంగీదేశము, తూర్పు సముద్రము చేత చుట్టబడింది. దక్షిణగంగ అని పిలువబడే, గౌతమీనది, తూర్పుసముద్రంలో కలుస్తుంది. అందువల్ల, మహాభారతాంధ్రీకరణకు పురికొల్పిన రాజరాజనరేంద్రుని యొక్క, దానిని సిద్ధింపజేసిన నన్నయల యొక్క సంగమము - సాగరము గంగానదుల సంగమము వలె - అపూర్వమైన కలయిక అని చెప్పికొనక తప్పదు.
No comments:
Post a Comment