ఆ నా తండ్రి యనన్ దధీచి శిబి కర్ణాదుల్ పునారూప సం
స్థానం బందిన కర్మయోగి సితచంద్రప్రౌఢ కాంతిచ్ఛటా
స్నానం బాడిన స్వచ్ఛలింగమయు నిన్ సాధించి మా నందమూ
ర్లోనన్ నిల్పిన భక్తరాజు సుజనశ్లోకుం డుదారుం డొగిన్.
ఇది శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలోని ఒక ప్రసిద్ధమైన పద్యము. కవితారూపంగా పితౄణం తీర్చుకున్న యీ పద్యంలో, విశ్వనాథవారు తమ తండ్రిని దధీచి, శిబి, కర్ణుడు మొదలగువారితో పోల్చారు. ఎంతో మంది దాతలు ఉండగా, యీ ముగ్గురినే పద్యంలో యెందుకు పేర్కొన్నారు విశ్వనాథవారు? ధనము, గృహాలు, భూమి, బంగారము, అగ్రహారాలు, గోవులు మొదలైనవి దానమిచ్చిన దాత లుండవచ్చు గాక! కానీ, ప్రాణత్యాగానికి సిద్ధపడి, తన వెన్నెముకను దాన మిచ్చినవాడు దధీచి. దేహంలోని మాంసాన్ని కోసి ఇచ్చినవాడు శిబి. శరీరానికి అంటుకొనియున్న కవచ కుండలాలను దానం చేసినవాడు కర్ణుడు. అందువల్ల, వారు మహాదాతలుగా భూమిపై నిలిచిపోయారు. అట్టి విశ్వనాథవారి తండ్రి శోభనాద్రి గారు ఒక కర్మయోగి అనీ, స్వచ్ఛమైన స్ఫటికలింగాన్ని కాశీ నుంచి తీసుకువచ్చి, తమ స్వగ్రామం నందమూరులో ప్రతిష్టించిన భక్తరాజు, సుజనుడు, ఉదారుడు అని, తన తండ్రికి శాశ్వత యశస్సును కూర్చిపెట్టారు విశ్వనాథవారు.
భక్తరాజు ఆన్న పదం చెవులలో పడగానే, తెలుగువారికి ప్రాతఃస్మరణీయులైన మహాభక్తులు, పోతరాజు (పోతన), గోపరాజు (రామదాసు), త్యాగరాజు గుర్తుకువస్తారు.
No comments:
Post a Comment