అసితాబ్జేక్షణ చూడు కేతకి శివత్యాగాపవాదంబు దీ
ర్ప సముద్ధూళితధూళికాభసితయై బద్ధాళిరుద్రాక్షయై
అసిపత్రాసిక బూని నిల్చుటయు నయ్యష్టాత్ము త్రైలోక్య జీ
వసముజ్జీవిక యైనమూర్తి దరియన్ వచ్చెన్ సదాక్షిణ్యతన్.
అసితాబ్జేక్షణ. అంటే నల్ల కలువల వంటి కనులు కలది గిరిక. కేతకి అంటే మొగలిపూవు. మొగలిపూవు శివపూజకు పనికిరాదు. ఆ అపవాదును తొలగించుకోవటానికా అన్నట్లు, మొగలిపూవు, తెల్లని పుప్పొడి అనే విభూతి పూసుకొని, తుమ్మెదల బారులనెడి రుద్రాక్ష మాలలను ధరించి, మొగలిరేకు అనే కత్తిని పూని, ప్రాణత్యాగానికి సిద్ధపడింది. అప్పుడు శివుడు అనుగ్రహించి, అష్టమూర్తులలో ఒకడయిన దక్షిణానిలమును ఆ సమీపములో వ్యాపించేటట్లు చేశాడు. అంటే, వసంతఋతువులో, మొగలిరేకులు పుప్పొడితో అలముకొని, తుమ్మెదల బారులతో, దక్షిణ దిక్కు నుండి వీచే గాలితో, సువాసనలు విరజిమ్ముతున్నాయి.
ఇదీ పై పద్యము యొక్క భావము. ఈ మాటలు చెలికత్తెలు గిరికతో అంటున్నారు.
రామరాజ భూషణుని వసుచరిత్రము తృతీయాశ్వాసములోని యీ పద్యము వసంతఋతు వర్ణనకు సంబంధించినది.
No comments:
Post a Comment