అనఘచరిత్ర! విన్ము శరణాగతు జేకొన కునికి శుద్ధ మి
త్రునియెడ జేయు ద్రోహము, వధూటి వధించుట, విప్రునర్థముం
గొనుట యనంగ గల్గునివి గూడ సమం బగు నాకు జూడ భ
క్తు ననపరాధునిన్ విడుచుదోషముతో నిది యోర్వవచ్చునే?
పాండవులు, ద్రౌపదీ సహితంగా, భారతదేశపు నాలుగు దిక్కులకు, హిమాలయాలకు వెళ్ళి, మేరుపర్వతం వైపు వెళ్ళారు. ముందుగా ద్రౌపది, తరువాత నలుగురు అన్నదమ్ములు ఒకరొక్కరుగా విగతజీవులై పడిపోగా, ధర్మరాజు ముందుకు సాగిపోయాడు. ఒక కుక్క మాత్రం అతడిని వెంబడిస్తూ వచ్చింది. ధర్మరాజునకు యెదురుగా ఇంద్రుడు దివ్యరథంతో వచ్చి, ధర్మరాజుని స్వర్గానికి ఆహ్వానించాడు. ధర్మరాజు, తనను అనుసరిస్తూ వచ్చిన కుక్కను కూడ తనతో పాటు స్వర్గానికి తీసుకువెళ్ళమన్నాడు. కుక్కకు స్వర్గప్రవేశం లేదన్న ఇంద్రునితో, ధర్మరాజు ఇట్లా అన్నాడు.
" ఓ పుణ్యాత్ముడా! నేను చెప్పేది వినుము. శరణుకోరినవాడిని విడిచిపెట్టడం, మంచి మిత్రుడికి ద్రోహం చెయ్యటం, అప్పుడే వివాహమైన వధువును వధించటం, బ్రాహ్మణుని ధనాన్ని అపహరించటం, అనేవి పాపాలు. ఈ పాపంతో సమానమైనదే ఏ అపరాధమూ చేయని సేవకుని వదలివెయ్యటం కూడా. ఈ పాపాన్ని నేనెట్లా సహించగలుగుతాను. "
ధర్మరాజు ఎందరో మహనీయుల నుండి రాజనీతిని నేర్చుకున్నాడు. మహాభారతంలో మనకు యిది స్పష్టంగా కనుపిస్తుంది. సేవకుడిని విడిచిపెట్టకూడదనే రాజనీతిని, శునకం విషయంలో కూడా ఆచరించి, ధర్మరాజు తన ఉదాత్తతను ప్రదర్శించాడు.
ఈ పద్యం తిక్కనగారి మహాప్రస్థానికపర్వంలో ఉన్నది.
No comments:
Post a Comment