తన కప్పు నెఱికొప్పుననె వూని గౌరీసమాఖ్య మించి జనించినట్టి యార్య
తన చాపలము చూపులనె చూపి సిరు లెల్ల కడ జల్ల వచ్చిన కమలపాణి
తన పాండిమము నవ్వులనె యుంచి గాంధర్వ మవనికి దెచ్చిన హంసయాన
తన యదృశ్యత నడుమనె తాల్చి సాంగయై మొనసిన యతనుసమ్మోహవిద్య
గావలయు నీ వెలది దీని కాంతి గుణకళాభిరూప్యంబు లెఱిగించి యా మహేశు
నా నగోద్ధారకుని నా ప్రజాధినాథు నా జగన్మోహనుని దెత్తు ననుచు జనియె.
గిరిక సౌందర్యాన్ని వర్ణించిన యీ పద్యం రామరాజభూషణుని వసుచరిత్రము ద్వితీయాశ్వాసములో కనబడుతుంది.
చాటుగా గిరికను చూసి ముగ్ధుడైన వసురాజు మిత్రుడు, ఆమెకు తగిన వరుడు తన మిత్రుడైన వసురాజేనని తలపోసి యీ విధంగా అనుకొన్నాడు:
" ఈ అమ్మాయి, నల్లదనాన్ని కొప్పులో ధరించిన పార్వతియో, బెదురుచూపుల్ని కళ్ళలో నిమిడ్చిన లక్ష్మీదేవియో, తెల్లదనాన్ని నవ్వులయందిమిడ్చిన సరస్వతియో, కనపడీకనపడనట్లున్న సూక్ష్మతను నడుములో పొందుపరచిన సమ్మోహనశక్తియో, అయివుండాలి. ఇటువంటి అత్యంత సౌందర్యరాశి రూపురేఖావిలాసాలు నా మిత్రునికి తెలిపి ఇక్కడకు తీసుకొనివస్తాను. "
గిరికను ఆర్య(గౌరి), కమలపాణి(లక్ష్మి), హంసయాన(సరస్వతి), అతను (మన్మథుని) సమ్మోహవిద్య అనే ఉపమానాలచే వర్ణించడం వల్ల, యీ పద్యంలో రూపకాలంకారము, , ఆ మహేశుని (శివుని, మహాప్రభువుని), నగోద్ధారకుని (విష్ణువును, కోలాహల పర్వతాన్ని గోటితో మీటిన వానిని), ప్రజాధినాథుని ( బ్రహ్మను, జననాథుని), ఆ జగన్మోహనుని (మన్మథుని, జగన్మోహనాకారుని) అనేటటువంటి శబ్దప్రయోగంతో అర్థద్వయాన్ని సాధించడం కనపడతాయి.
No comments:
Post a Comment