కదళి గభీర పుష్ప పుటి కాచ్ఛట జేతుల నిప్పపిండిపై
గుదురుగ నిల్పియోపు గతి గూనల నూనియ నించి, త్రాట
మున్నుదికిన శాటి వ్రేల, నది నొక్కొట గ్రుంకిడి వత్తు రెందఱే
వదలక యాతనింట శనివారమునన్ బరదేశి వైష్ణవుల్.
వైష్ణవులకు అతిథి అభ్యాగతుల సేవ చాలా ముఖ్యమైనది. విష్ణుచిత్తుని ఇంటికి అనేకమంది అతిథులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా శనివారం నాడు ఒక తిరుణాల లాగా ఉంటుంది. ఆ వచ్చేవారికి స్నానపానాదులు, భోజనాదికాలు సమకూర్చడంలో నిమగ్నమై ఉంటాడు విష్ణుచిత్తుడు. దీనిని చాలా చక్కగా, విపులంగా వర్ణించారు రాయలవారు.
వచ్చిన భక్తులు, ఇప్పపిండి తీసుకొని, దానిని ముద్దగా చేసి, చేతిలో దానిని కుదురుగా నిలిపి, దానిపైన అరటి దొప్ప అమర్చి, ప్రక్కన గూనలలో నున్న నూనెను దానిలో పోసుకుంటారు. తగినంత నూనెను నింపడానికి వీలుగా, అరటి దొన్నెలను లోతుగా ఉండేటట్లుగా కుడతారు. ఆ తరువాత, దొడ్లో ఉతికి ఆరవేసిన మడి బట్టల్ని, త్రాడుకు వ్రేలాడదీసుకొని, నదిలో స్నానం చేయడానికి వెళ్తారు. మడిబట్టలను తాకకుండా జాగ్రత్తగా త్రాడుకు వ్రేలాడదీస్తారు. స్నానాదికాలు, అనుష్ఠానం పూర్తిచేసుకొన్న తరువాత, విష్ణుచిత్తుని ఇంటికి వచ్చి భోజనం చేస్తారు..
ఈ పద్యంలో, ఇన్ని వివరాలు ఇమిడి ఉన్నాయి. ఆ రోజుల్లో పాటింపబడిన వైష్ణవాచారాలను ఎంతో అద్భుతంగా, మనస్సుకు హత్తుకొనేటట్లుగా వర్ణించారు రాయలవారు.
No comments:
Post a Comment