పునుగుందావి నవౌదనంబు మిరియంపుం బొళ్ళతో జట్టి
చుయ్యను నాదాఱని కూరగుంపు; ముకు మందై యేర్చు నావం జి
గుర్కొను పచ్చళ్ళును, బాయసాన్నములు నూరుంగాయలున్, జే సుఱు
క్కను నేయుం, జిఱుపాలు వెల్లువగ నాహారంబిడు న్శీతునన్.
చలికాలంలో తినే, తినవలసిన, ఆహారపదార్థాలను వర్ణిస్తున్నారు రాయలవారు.
పునుగు వాసన వేసే, అప్పుడే వండిన, వేడి వేడి అన్నం తినాలట. ఆ రోజుల్లో రాజనాలు అనే కమ్మని వాసన గల వడ్లను పండించేవారు. ఈ రోజుల్లో మిరపకాయల వాడకం అధికం. కానీ, ఆ రోజుల్లో, మిరియాల పొడిని కారంగా వాడేవారు. మిరియాల పొడితో, చట్టి చుయ్యిమనేటట్లు తిరుగమూత వేసిన కూరలు, ముకుపుటాలను అదరగొట్టే ఘాటైన ఆవబెట్టిన పచ్చళ్ళు (మాంఛి ఘాటుగా ఉంటే ముక్కు జలుబూ గిలుబూ వదిలిపోతాయి కదా - అదీ, " ముకుమందై " అంటే), ఇక పలురకాలైన పాయసాలు, ఆవకాయ, మాగాయ లాంటి ఊరగాయలు. ఇవన్నీ ఉన్నా, చెయ్యి చురుక్కుమనే నెయ్యి లేకపోతే యెట్లా? చివరగా, చక్కగా కాచిన పాలు. ఇవన్నీ చలికాలంలో, ఒంట్లో వేడిని పుట్టించే ఆహారపదార్థాలు. ఇదీ శీతాకాలపు భోజన పద్ధతి.
భోజనప్రియత్వం ఒక కళ అయితే, దానిని చ్ఛందోబద్ధం చేయడాన్ని యేమనాలి? పాఠకుడి నోరు ఊరించేటట్లు వ్రాయడం రాయలవారికే చెల్లింది.
ఋతువులకు తగ్గట్లుగా ఆతిథ్యాన్ని నెరపే విష్ణుచిత్తుని భాగవతులసేవ గురించి చెప్పే సందర్భంలోని యీ పద్యం ఆముక్తమాల్యద ప్రథమాశ్వాసంలో ఉన్నది.
No comments:
Post a Comment