విద్వత్సంస్తవనీయ భవ్య కవితావేశుండు విజ్ఞాన సం
పద్విఖ్యాతుడు, సం యమి ప్రకర సంభావానుభావ్యుండు, గృ
ష్ణద్వైపాయను డర్థి లోకహితనిష్ఠం బూని కావించె ధ
ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగు లేఖ్యంబైన యామ్నాయమున్.
మహాభారతము పండితుల చేత మెచ్చబడింది. దీనిని రచించిన వాడు కృష్ణద్వైపాయనుడు. అనగా నల్లనివాడు, యమునాద్వీపములో పుట్టినవాడు అయిన వ్యాసుడు. ఆయన ఎటువంటివాడు? భవ్య కవితావేశుడు. అంటే, గొప్పదైన కవితావేశం కలవాడు. ఆధ్యాత్మిక జ్ఞానమనే సంపద కలవాడు. మహర్షుల చేత గౌరవింపదగినవాడు. ఆమ్నాయముల (వేదముల) విభాగము చేసినవాడు. వ్యాసమహర్షి ఎందుకు యీ పని చేశాడు? లోకహితం కోరి చేశాడు. ఏ విధమయిన భావనతో చేశాడు? ధర్మాద్వైతస్థితితో. అనగా, ధర్మము మీద అనురక్తితో, బ్రహ్మజిజ్ఞాస కలిగించాలనే బుద్ధితో.
ఇన్ని విశేషాలున్నాయి యీ పద్యంలో. అందుకే, యీ పద్యాన్ని తిక్కన భారతాన్ని గురించి చెప్పేటప్పుడు ' భవ్య కవితావేశుడు ' అని తిక్కన సోమయాజి పరంగా కూడా తప్పకుండా ఉదహరిస్తారు.
చివరగా ఒక మాట. వేదములు అపౌరుషేయాలు. ఆ కారణంగా అలేఖ్యము. పంచమవేదము అని పిలువబడే మహాభారతము లేఖ్యము, వ్రాయబడినది.
No comments:
Post a Comment