ప్రాలేయాచల కన్యకా వదన శుంభత్పద్మ సౌరభ్యమున్
గ్రోలంగల్గియు దుష్టిలేక ముని హృత్క్రోడాబ్జ సౌగంధ్య లీ
లా లాలిత్యము గోరు నొక్క సిత రోలంబంబు నైజాకృతిన్
డాలొందించు బరాసులన్ భ్రమరకీట న్యాయ రీతిన్ పురిన్.
ప్రాలేయాచల కన్యక అంటే మంచుకొండ కూతురు. ఆమె యొక్క ప్రకాశవంతమైన ముఖపద్మమునందలి అమృతాన్ని త్రాగగలిగియున్నా, తృప్తి లేక, ఒక తెల్ల తుమ్మెద, మునుల హృదయపద్మ పరిమళము కోరుకొంటున్నదట. అప్పుడు తనివి తీరినదై, భ్రమరకీట న్యాయం చేత, తన నిజాకృతిచే వారిని పరాసుల చేసి, తన రూపమే వారికి వచ్చేటట్లు చేస్తున్నదట..
భ్రమరకీట న్యాయము అంటే తుమ్మెద చుట్టూ తిరిగిన క్షుద్రకీటకాలన్నిటికీ తన రూపమిచ్చి తుమ్మెదలుగా మార్చివేయడము.
ఇంతకీ, ఎవరా మంచుకొండ కూతురు? హిమవంతుని కూతురు పార్వతి. శీతాహార్యసుతాళిని (చూడుడు సువర్ణ సుమన సుజ్ఞేయము- 66 (పాండురంగ మాహాత్మ్యము). పార్వతి అనే ఆడుతుమ్మెద. ఈ ఆడుతుమ్మెద ముఖపద్మ సౌరభ్యాన్ని గ్రోలడానికి హక్కుదారు యెవరు? శివుడనే తెల్ల తుమ్మెద. ఈ రెండు తుమ్మెదలూ యెక్కడుంటాయి? కాశీక్షేత్రములో. ఈ శివుడనే తెల్ల తుమ్మెద, పార్వతి అనే ఆడుతుమ్మెద ముఖపద్మం జోలికి వెళ్ళకుండా, తపస్సు చేత యెఱ్ఱబడిన మునుల హృదయాలనే పద్మముల సువాసనకు ఆకర్షితుడయ్యాడు. పరవశుడయ్యాడు. బోళాశంకరుడు కదా! అంతే! వాళ్ళందరినీ అంత్యకాలంలో తనను చేసేశాడు, సారూప్యమిచ్చాడు. ఇదీ కాశీ క్షేత్ర మహిమ. కాశీ క్షేత్రమనే పద్మము నందలి మధువును గ్రోలి ఆనందాబ్ధిలో తేలియాడుతూ, చివరకు కైవల్యాన్ని పొందుతారు.
ఇది తెనాలి రామకృష్ణకవి రచించిన ప్రబంధము పాండురంగ మాహాత్మ్యము ప్రథమాశ్వాసము లోనిది.
No comments:
Post a Comment