బలవన్మేరు శరాసనంబును బరబ్రహ్మాస్త్రముం గల్గు బ
ల్విలుకానిం దృణమైనచాపమున గాలిం బోవు లేయల్గులం
జల మానించి సగంబు చేసి తవునౌ సంకల్పసిద్ధు ల్గొనం
బలు మేరున్ నిరసింప లేజిగురుగొమ్మం జేవ గాకుండునే.
వనంలో ఒంటరిగా తిరుగుతూ, మదనతాపానికి గురించి అయిన గిరికాదేవిని కలుసుకొన్న చెలికత్తెలు, ఆమెను ఓదార్చి, మన్మథుని యొక్క శక్తిని పొగడటం మొదలుపెట్టారు.
శివుడు త్రిపురాసుర సంహారవేళ, బలవత్తరమైన మేరుపర్వతాన్ని ధనుస్సుగాను, పరబ్రహ్మమైన విష్ణువును, బాణంగాను చేసుకొన్నాడు. అటువంటి మేటి విలుకానిని ఎదుర్కొన్నదెవరు? గడ్డిపోచలాంటి విల్లును, గాలికి యెగిరిపోయే పూలను బాణాలుగా చేసుకొన్న మన్మథుడు. చెఱకు తృణవృక్షం క్రిందకు వస్తుంది. ఈ రకంగా శివుని ఎదుర్కొని, ఆయనను కృశింపచేసాడు, సగ మయ్యేటట్లు చేశాడు మన్మథుడు. మేలు, మేలు అంటున్నారు చెలికత్తెలు. శివుడు అర్థనారీశ్వరుడు. సంకల్పసిద్ధుడు చేపట్టిన, బలమైన మేరుపర్వతాన్ని జయించటమనేదానికి, లేత చిగురు కొమ్మకు చేవ రాకుండా ఉంటుందా? సంకల్పసిద్ధులు, అంటే, పని నెరవేర్చుకోవాలనే ఆశయం కలిగినవారు. మరి వారి కార్యం సిద్ధించకుండా ఉంటుందా? సంకల్పసిద్ధుడు అంటే మన్మథుడు. సంకల్పాలు మనస్సులో నుండి పుడతాయి. అందుకే మన్మథుణ్ణి మనసిజుడు అంటారు.
వసు మహారాజుని చూసినప్పటినుండి, గిరికాదేవికి మన్మథతాపం ఎక్కువయ్యిందని, మన్మథుని శక్తి బలవత్తరమైనదని యీ పద్యం భావము.
ఈ పద్యం రామరాజ భూషణుని వసుచరిత్రము, తృతీయాశ్వాసము నందలిది.
No comments:
Post a Comment