కొండట విల్లు వేదలలకుండలిరాజట నారి అ మ్మనం
తుండట బైటిపల్లియలు దున్మినవాడట యొండు రెండు భ
ర్గుం డిది నిండు బౌరుషమొకో యని గెల్వవె ముజ్జగంబు లు
ద్దండత నొక్క తుంట విలు దాలిచి యంటిన గందుతూపులన్.
ఇది చాలా అందమైన పద్యం. రామరాజభూషణుని వసుచరిత్రము తృతీయాశ్వాసంలో ఉంది.
శివుడు త్రిపురాసుర సంహారానికి వాడిన ఆయుధసంపత్తిని, మన్మథుని ఆయుధాలతో పోల్చి, యింత బలహీనమైన ఆయుధాలతో మన్మథుడు త్రిలోకవాసులను మోహపరవశుల్ని చేస్తున్నాడు కదా! అని వర్ణించిన సన్నివేశం.
శివుని విల్లు మేరుపర్వతం, నారి ఆదిశేషువు, బాణం శ్రీమహావిష్ణువు. బైటి పల్లెలు త్రిపురాలు. చాలా గొప్ప ఆయుధాలు. చేసిన పని మాత్రం ఆయన హోదాకు తగింది కాదు. ఎందుకంటే? ఏవో ఒండు రెండు, అంటే, మూడు పల్లెటూర్లను ధ్వంసం చేశాడు. ఇదేమి నిండు పౌరుషం? ఇక మన్మథుడో? విరిస్తే విరిగిపోయే చెఱుకుగడ విల్లు, ముట్టుకుంటే వాడిపోయే పువ్వులు బాణాలు. ఇవీ మన్మథుని ఆయుధాలు. కానీ, ఈయన ముల్లోకాలను కామపరవశులుగా చేస్తాడు. మరి, ఎవరు గొప్ప? అని గిరిక చెలికత్తెలు అంటున్నారు.
నిండు పౌరుషం లేదనడంలో, సగభాగమే పురుషుడని, శివుని అర్థనారీశ్వరత్వాన్ని ధ్వనింపజేస్తుంది.
No comments:
Post a Comment