వనజముఖు ల్కనుంగొని రవారితవారితరంగరంగ న
ర్తన సలిల భ్రమభ్రమణ రంగదభంగ రథాంగధామమున్
మనసిజ హోమకుండనిభ మంజుల కంజగతాళిధూమమున్
ధనద సరోజసమధామము నొక్క సరోలలామమున్.
గిరికాదేవి చెలికత్తెలు చూశారట. ఏమి చూసారు? ఒక్కసరో లలామమున్. ఒక సరస్సును. అది యెట్లా ఉన్నది?
అవారిత వారితరంగ రంగ నర్తన సలిల భ్రమభ్రమణ రంగదభంగ రధాంగ ధామమున్. చాలా పెద్ద సమాసము. విడదీసి అన్వయం చేసుకొంటే, మనస్సు పులకాంకురమౌతుంది. అవారిత నివారింపబడని, వారితరంగ, జల తరంగములనెడి, రంగ, నాట్యస్థలమందలి, నర్తన, నాట్యమందు, సలిల భ్రమభ్రమణ, సుడి వలె తిరిగెడు చక్రనాట్యముచేత, రంజిత్, ప్రకాశించుచున్న, అభంగ, భంగము లేని, రథాంగ, చక్రవాకములకు, ధామమున్, స్థానమయినదియు.
ఇంతవరకు అర్థము చూసుకొంటే, సరస్సులో నీటి తరంగాలు ఎడతెరపి లేకుండా వస్తున్నాయి. అందులోని సుడిగుండాలు చక్రవాకములకు నాట్యరంగం లాగా ఉన్నది. అందుచేత, ఆ సరస్సు చక్రవాకములకు ఆటపట్టయి అందంగా ఉంది.
ఇక రెండవ సమాసము. మనసిజ హోమకుండనిభ మంజుల కంజగతాళి ధూమమున్. మనసిజ, మన్మథుని యొక్క, హోమకుండనిభ, హోమకుండము వలె నున్న, మంజుల కంజ, చక్కని యెఱ్ఱతామరలను, గత, పొందియున్న, అళి ధూమమున్, తుమ్మెదల బారులు కలిగినదియు. ఈ సమాసాన్ని అర్థం చేసుకొందాము. ఆ సరస్సులోని యెఱ్ఱతామరపూలు హోమకుండము వలెను, ఆ తామరల మీద వ్రాలిన తుమ్మెదల బారులు, హోమగుండము నుంచి వచ్చే పొగ వలెను ఉన్నది.
ఇక యీ రెండు సమాసములను అన్వయం చేసుకొంటే, ఆ సరస్సు ధనద సరోజధామ సమధామము వలె నున్నది. ధనదుడు అనగా కుబేరుడు. ఆయనకు సరోజధామముంది. అదే మానస సరోవరం. సమధామమున్ అనగా దానితో పోల్చదగిన సరోవరాన్ని చూసారు.
గిరిక చెలికత్తెలు మానస సరోవరంలాంటి ఒక అందమయిన సరస్సును చూసారు. ఆ సరస్సులోని సుడిగుండాలు, చక్రనాట్యస్థలాన్ని తలపిస్తూ, చక్రవాకములకు ఆటపట్టయి, హోమగుండంలాగా ఉన్న యెఱ్ఱని తామరపూలతోను, ఆ తామరపూల మీద వ్రాలిన తుమ్మెదల బారులు, హోమగుండం నుంచి వచ్చే పొగ లాగాను ఉండి చూసేవారికి కనువిందు చేస్తున్నది.
ఇంత యెందుకు వ్రాయవలసి వచ్చిందంటే, యీ పద్యం శబ్దసుభగంగా ఉండి, అన్వయం చేసుకొనకపోతే, అర్థము చేసుకొనడము కష్టమయ్యేటట్లు ఉన్నది. ఒక్కసారి అన్వయం చేసుకొని చదువుకొంటే, అబ్బ! ఎంత మంచి పద్యము అని, అనిపించక మానదు.
వసుచరిత్రము తృతీయాశ్వాసములోని యీ పద్యములో వృత్యనుప్రాసము ఉంది.
No comments:
Post a Comment