బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ
సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దు
స్సహతర మూర్తికిన్ జలధిశాయికి బాయక శయ్యయైన య
య్యహిపతి దుష్కృతాంతకు డనంతుడు మాకు బ్రసన్నుడయ్యెడున్.
కుండలాలను అపహరించిన తక్షకుణ్ణి వెంబడిస్తూ నాగలోకానికి వెళ్ళిన ఉదంకుడు, అక్కడ, సర్పశ్రేష్ఠులైన ఆదిశేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకులను వరుసగా నాలుగు పద్యాలలో స్తుతించడము కనబడుతుంది. అయితే, ఈ స్తుతించడములో, ఒక్కొకరిని స్తుతించే తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. పైకి స్తుతిలాగా ఉన్నా, లోపల ఎత్తిపొడుపు ఉంటుంది. అదికూడా, ఆదిశేషుడితో మొదలుపెట్టి తక్షకుడి వరకు వెళ్ళేసరికి తారాస్థాయికి చేరుకుంటుంది.
" అనేకమైన అడవులతోను, చెట్లతోను, కులపర్వతాలతోను, చక్కగా నిండి కళ కళ లాడే సరస్సులతోను, నదులతోను, కూడియున్నటువంటి యీ గొప్ప భూభారాన్ని, తన వేయిపడగలతో వహిస్తూ, నిర్నిరీక్ష్యమైన రూపం గల విష్ణుమూర్తికి యెప్పుడూ పానుపుగా ఉండి, పాపాలను పోగొట్టే, అనంతుడని పిలువబడే నాగరాజు మాకు ప్రసన్న మాకు గాక.", అని యీ పద్యభావము.
మహేద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియాత్రం అనే ఏడు పర్వతాలూ కులపర్వతాలని పిలువబడతాయి.
ఈ పద్యములో చమత్కారమేమంటే, ఇందులో ఎత్తిపొడుపు ఉంది. మీ ఇంటిలోనివాడు నా వస్తువు నొకటి దొంగతనం చేసాడు. ఈ దొంగతనం చేసిన పిల్లవాడు, నల్గురు అన్నదమ్ముల్లో చివరివాడు, తుంటరి వెధవ. పెద్దవాడు కాస్త ఊరిలో మర్యాద కలవాడు. ఆయన ధర్మ బుద్ధి కలవాడు, న్యాయాన్యాయములు విచారించగలవాడు. అయితే, ఆయనకు, ఇదిగో మీ చిన్నతమ్ముడు ఉత్త దొంగవెధవ అని సూటిగా చెప్పలేము. నర్మగర్భంగా, ఆయన పెద్దరికాన్ని గుర్తిస్తున్నట్లుగా చెప్పాలి. ఈ పద్యంలో నన్నయగారు చేసింది అదే. జలధిశాయికి పాయక శయ్యయైన మీరు, మీ ఇంట్లో వాడు మీ పరువుప్రతిష్ఠలను, నీట్పాలు చేస్తుంటే ( పాడుచేస్తుంటే), చూస్తూ ఊరుకోవడము న్యాయమా? అని చెప్పీ చెప్పనట్లు చెప్పాడు ఉదంకుడు. వ్యవహారశైలి తెలిసిన గడుసరి చేసే పని యిది.
ఇక, కవిత్వ పరిశీలనకు వస్తే, నన్నయగారి కవిత్వంలోని మూడు ప్రధాన లక్షణాలలో ఒకటైన అక్షరరమ్యత యీ పద్యంలో కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఇంకొక విశేషమేమంటే, ఈ నాలుగు పద్యాల చివర నున్న " మాకు ప్రస్నను డయ్యెడున్" అనే పదబంధము, ఒకే మకుటంతో, వంద, లేక వందకు పైచిలుకు పద్యాలతో వ్రాయబడే శతక రచనకు నాంది పలికిందని చెప్పవచ్చును.
ఈ పద్యం నన్నయ భారతము, ఆదిపర్వము, ప్రథమాశ్వాసంలో ఉన్నది.
No comments:
Post a Comment