మఱల నిదేల రామాయణం బన్నచో నీ ప్రపంచకమెల్ల నెల్లవేళ
దినుచున్న యన్నమే దినుచున్న దిన్నాళ్ళు తన రుచి బ్రదుకులు తనవి గాన
చేసిన సంసారమే సేయుచున్నది తనదైన యనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెద నేనును నా భక్తి రచనలు నావి గాన
కవి ప్రతిభలోన నుండును గావ్యగత శ
తాంశముల యందు దొంబదియైన పాళ్ళు
ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవాకథాదృతిని మించి.
శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలో యీ పద్యము చాల ప్రసిద్ధమైనది. పండితుల దగ్గరనుండి పామరుల వరకు రామాయణము గురించి మాట్లాడేటప్పుడు, యీ పద్యమును ప్రస్తావించడము జరుగుతూ ఉంటుంది.
తెలుగులో చాలామంది రామాయణాలు వ్రాసారు. భాస్కర రామాయణము, రంగనాథ రామాయణము, ద్విపద రామాయణము,
మొదలైనవి ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంకొక రామాయణాన్ని వ్రాయడమెందుకు అని పాఠకుల ప్రశ్నను, విశ్వనాథవారే వేసుకొని, ఒక చక్కని, హేతుబద్ధమైన సమాధానాన్ని ఇవ్వడమే గాక, ఒక సిద్ధాంత ప్రతిపాదన కూడా చేసారు.
మొదలైనవి ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంకొక రామాయణాన్ని వ్రాయడమెందుకు అని పాఠకుల ప్రశ్నను, విశ్వనాథవారే వేసుకొని, ఒక చక్కని, హేతుబద్ధమైన సమాధానాన్ని ఇవ్వడమే గాక, ఒక సిద్ధాంత ప్రతిపాదన కూడా చేసారు.
ఈ ప్రపంచములో, పుట్టిన ప్రతివారు రోజూ అన్నం తింటూనే ఉన్నారు.. కానీ, తిన్న ప్రతిసారి, దానిలో కొత్త రుచిని ఆస్వాదిస్తూనే ఉన్నారు. సంసార సుఖాలు అనుభవిస్తూనే ఉన్నారు. ప్రతిసారీ, కొత్త అనుభూతిని పొందుతున్నారు. ఏంతోమంది రాముణ్ణి భక్తితో కొలుస్తూనే ఉన్నారు. కానీ, తన భక్తిభావము తనదే కావున, మరల రామాయణము వ్రాయుట తనకు ఇష్టము కనుక వ్రాసున్నానన్నారు విశ్వనాథ. ఇక్కడ, కీర్తిశేషులు జువ్వాడి గౌతమరావుగారు చెప్పిన ఒక మాట మీతో విన్నవించుకొనాలి.
" ఇది వరకెందరో రాసిన రామాయణమును మరల వ్రాయుట ఎందుకనగా. ఇది సమాధానము. ఇందులో రెండంశములున్నవి. ఒకటి నా ఇష్టము. రెండవది దేహధారణమునకు భోజనమెంత అవసరమో, సంసారతరణమునకు భక్తి అంత అవసరము. ఈ దేహమున్నంతవరకు మరల మరల తినుట యెట్లో, ఈ సంసార మున్నంతవరకు, రామకథాస్ఫురణ అటువంటిదని స్ఫూర్తి కనుకనే. "
ఇక కావ్యమునకు సంబంధించి విశ్వనాథవారి సిద్ధాంత ప్రతిపాదన ఏ విధంగా ఉన్నదో చూద్దాము.
కావ్యగతంగా ఉన్న, పది పాళ్ళ కథ, తొంబది పాళ్ళ కవి ప్రతిభతో కలసి, ఉత్తమోత్తమ కావ్యసృష్టి జరుగుతుంది. కారణం విచారిస్తే, కావ్యము నందు నవనవోన్మేషముగా చేయబడిన రసపోషణ వల్ల జరుగుతుంది. ఇక్కడ విశ్వనాథవారు ఒక సిద్ధాంత ప్రతిపాదన చేశారు. కావ్యగతంగా ఉన్న కథ కంటే, రసము వేయిరెట్లు గొప్పది. సంస్కృతము లాగానే, తెలుగులో కూడా వేయి అనే సంఖ్యాపదానికి అనంతమైన అనే అర్థాన్ని అన్వయించుకొంటే, కథ కంటే కావ్యగతంగా ఉన్న రసము యెన్నో రెట్లు గొప్పది అని విశ్వనాథవారి సిద్ధాంతము. అప్పుడే, కావ్యము పది కాలాలపాటు నిలుస్తుంది.
No comments:
Post a Comment