ధర్మనిరూపకత్వమున ధైర్యమునన్, మహనీయవృత్తి, స
త్కర్మ విధిజ్ఞతం జతురతా మహిమన్ దృఢబుద్ధి నెవ్వరున్
ధర్మము పాటిగా రనగ ధాత్రి బ్రసిద్ధుడవైన యిట్టి నీ
పేర్మికి నీడె? దుర్దశల పెల్లునకున్ దురపిల్లు టారయన్.
ధౌమ్యుడు పాండవుల పురోహితుడు. వనవాసం చేస్తున్న పాండవులను అరణ్యంలో అనుసరించాడు. పన్నెండ్రేండ్ల వనవాసాన్ని పూర్తిచేసుకొని అజ్ఞాతవాసానికి సిద్ధపడుతూ, తమ కష్టాలను తలచుకొని దుఃఖిస్తున్న ధర్మరాజును ఓదారుస్తూ ధౌమ్యుడు చెప్పిన మాటలివి.
" ధర్మాధర్మాలను నిరూపించడంలోను, ధైర్యాన్ని అవలంబించడంలోను, అందరూ మెచ్చుకొనే ప్రవర్తనలోను, సత్కర్మల విధివిధానాలను తెలియడంలోను, నేర్పుగా పనులు చేయడంలోను, మొక్కవోని బుద్ధివిశేషంలోను, ధర్మరాజునకు సాటి రాగలవారెవరూ లేరు అని లోకప్రసిద్ధమైన మాట. అటువంటి గొప్ప పేరు కలిగిన నీ వంటివాడు కష్టాలకు క్రుంగిపోవడం తగునా? " (తగదని భావం).
మహాభారత కావ్యానికి ధర్మరాజు నాయకుడు. ఉత్తమ నాయకునికి ఉండవలసిన లక్షణాలకు యీ పద్యం అద్దం పడుతుంది.
ఈ పద్యం తిక్కన భారతము, విరాటపర్వము, ప్రథమాశ్వాసములో ఉన్నది.
No comments:
Post a Comment