ఆ నిష్ఠానిధి గేహసీమ నడిరేయాలించిన న్మ్రోయు నెం
తే నాగేంద్రశయాను పుణ్యకథలుం దివ్య ప్రబంధాను సం
ధాన ధ్వానము " నాస్తి శాక బహుతా నాస్త్యుష్ణతా నాస్త్యపూ
పో నాస్త్యోదన సౌష్టవం చ కృపయా భోక్తవ్య " మన్మాటలున్.
ఈ పద్యము విష్ణుచిత్తుని అతిథి, అభ్యాగతుల, భాగవతుల సేవను తెలియజేస్తుంది.
విష్ణుచిత్తుని ఇంటికి అర్థరాత్రి అపర రాత్రి అని లేకుండా పెద్దయెత్తున వైష్ణవ భాగవతులు వస్తుంటారు. ఆ ఇంటిలో ఎప్పుడూ విష్ణుమూర్తి పుణ్యచరిత్రలు, నాలాయిరం అనబడే ద్రవిడ ప్రబంధములోని స్తోత్రాలు, " అయ్యా! ఎక్కువ కూరలు వడ్డించలేకపోయాము, పదార్థాలు అంత వేడిగా ఉన్నట్లు లేదు, ఎక్కువ పిండివంటలు చేయలేకపోయాము, ఇంకా చక్కని భోజనము సమకూర్చలేకపోయాము, నా మీద దయయుంచి భోజనము చేయండి " అనే మాటలు వినపడుతూ ఉంటాయి.
ఇక పద్యములో నున్న " నాగేంద్రశయాను " అన్న విష్ణుమూర్తి పరంగా వాడిన విశేషణము చాలా ఔచిత్యభరితముగా ఉన్నది. శ్రీవిల్లిపుత్తూరులోని దివ్యవిగ్రహము శేషశాయిదే. ఇక పద్యములోని సంస్కృత సమాసముల గూర్చి. ఆ నాడు దేశవ్యాప్తముగా సంస్కృత భాష వినిమయంలో ఉన్నది. తీర్థయాత్రికులు వివిధ ప్రాంతములనుంచి వచ్చేవారు కనుక, అందరికీ అందుబాటులో నున్న సంస్కృతము వాడవలసివచ్చినదని అనుకొనవచ్చును.
శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద ప్రథమాశ్వాసము లోని యీ పద్యము చాలా ప్రసిద్ధమైనది .
No comments:
Post a Comment