వరణాద్వీపవతీ తటాంచలమునన్ వప్రస్థలీ చుంబితాం
బరమై సౌధసుధా ప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ
హరిణంబై అరుణాస్పదం బనగ నార్యావర్త దేశంబునన్
బుర మొప్పున్ మహికంఠహార తరళస్ఫూర్తిన్ విడంబింపుచున్.
ఇది అల్లసాని పెద్దనగారు రచించిన, మనుచరిత్రము అని పేరుగాంచిన స్వారోచిష మనుసంభవము అనే ప్రబంథం లోని మొదటి పద్యము. సామాన్యంగా, కథారంభము పురవర్ణనతో చేస్తుంటారు.
అరుణాస్పదమనే పురం ఉంది. అది ఆర్యావర్తంలో వరణానది ఒడ్డున ఉంది. ఆర్యావర్తము అంటే హిమాలయ పర్వతానికి వింధ్య పర్వతానికి మధ్య ప్రదేశం. వరణ, అసి అనే రెండు నదులు కలిసే చోట ఉండడం చేత వారణాసికి ఆ పేరొచ్చిందని పెద్దలు చెబుతుంటారు.
ఈ అరుణాస్పదంలో, పెద్ద పెద్ద మేడ లున్నాయి. అవి ఆకాశాన్నంటుతున్నాయి. ఆ మేడలకు వేసిన తెల్లని సున్నము, చంద్రునిలో నున్న జింకను (మచ్చను) కూడ తెల్లగా చేస్తున్నదట. అంటే, మేడలు అంత ప్రకాశవంతంగా ఉన్నాయి. ఆ విధంగా ఆర్యావర్తం మధ్యలో ఉండడం వల్ల, అరుణాస్పదం, భూదేవి ధరించిన హారంలోని పెద్ద మణిలాగా ఉందట.
ఈ పద్యం యెందుకు చెప్పవలసి వచ్చిందంటే, మహాకవులు కథాప్రారంభం చేసిన మొదటి పద్యం ఉజ్జ్వలంగా ఉండేటట్లు చూస్తారు. తెనాలికవి "శీతాహార్యసుతాళినీ వికచరాజీవంబు " అని కాశీ క్షేత్ర వర్ణన అదే తీరులో చేశారు. ఆ పద్యాలు ఎల్లకాలము గుర్తుండిపోతాయి. అటువంటిదే పై పద్యము.
No comments:
Post a Comment