కవిబ్రహ్మ తిక్కన భారతాంధ్రీకరణము విరాటపర్వముతో మొదలవుతుంది. అందులో, హరిహరాద్వైతాన్ని ప్రతిపాదించినది క్రింద నిచ్చిన యీ పద్యము.
శ్రీ యన గౌరి నా బరగు చెల్వకు జిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తి యై హరిహరంబగు రూపము దాల్చి " విష్ణు రూ
పాయ నమశ్శివాయ " యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికిన్.
మహాభారత రచనారంభానికి మంగాళాశాసన పూర్వకంగా, హరిహరతత్వాన్ని ప్రతిపాదిస్తూ, " లక్ష్మి అని, పార్వతి అని పిలువబడే స్త్రీకి మనస్సు రంజిల్లేటట్లుగా, మంగళకరమైన హరిహరాత్మక రూపం ధరించి, " విష్ణు రూపుడైన శివునికి నమస్కారము " అని భక్తులు కొలుస్తుండగా, వేదవిహితమైన యిట్టి ఉపాసనా పద్ధతికి, మనసులో మెచ్చుకొనే ఆ పరబ్రహ్మతత్వాన్ని నా అభీష్టాన్ని నెరవేర్చాలని ప్రార్థిస్తున్నాను " అని తిక్కన మహాభారతాంధ్రీకరణానికి శ్రీకారం చుట్టారు.
తిక్కన వ్రాసిన భారతానికి కృతిభర్త హరిహరనాథుడు. ఉపాసనాపరులకు నిర్గుణంగా హరిహరతత్వమైన యీ అబేదతత్వం, సగుణారాధకులకు హరిహరనాథుడుగా ప్రతిపాదించాడు తిక్కన. లౌకికంగా తన రచనను నిర్విఘ్నంగా కొనసాగేటట్లు చేయాలని, అలొకికమైన మోక్షసిద్ధిని కలుగజేయాలని, తిక్కన ఆకాంక్షిస్తున్నాడని వ్యక్తమౌతుంది.
No comments:
Post a Comment