వలుద కెంజడ కొప్పు వదలి వీడక యుండ
పెనుపాప తలపాగ బిగియజుట్టి
మెడకప్పుతో గూడి మిక్కిలి నలుపైన
కమనీయ కృష్ణాజినము ధరించి
భ్రూవికారములేని పొడవు ఱెప్పలలోని
ఘనదృష్టి నాసికాగ్రమున నిల్పి
యోగపట్టిక జెంది యొఱపైన నిలుకడ
నాసనస్థితబంధ మనువుపఱచి
నిస్తరంగకమైన మున్నీరువోలె
గర్జితము లేని ఘనఘనాఘనమువోలె
ధ్యాననిశ్చలుడగు నిందుధరుని
ప్రసవనారాచు డతిభయభ్రాంతు డగుచు.
మన్మథుడు శివుని తపస్సు భగ్నం చేయడానికి వచ్చినప్పుడు, నిర్భరయోగ సమాధిలో ఉన్న శివుని వర్ణన యిది.
జటాజూటంలో పెద్ద పామును తలపాగగా చుట్టుకొని, మెడలో ఉన్న మచ్చకు తోడు, కృష్ణజింక చర్మం ధరించి, మనసులో వికారాలు లేకపోవడాన్ని సూచించే, పొడవైన కనుఱెప్పలలోని దృష్టి ముక్కుకొన పైన నిలిపి, ధ్యానానికి అనువైన ఆసనంలో కూర్చొని, తరంగాలు లేని ప్రశాంతమైన సరోవరంలాగా, ధ్వని లేని గొప్ప మేఘంలాగా, నిశ్చలంగా ధ్యానమగ్నుడయియున్న శివుడిని చూసి మన్మథుడు చాలా భయపడ్డాడు.
శ్రీనాథ కవిసార్వభౌముని హరవిలాసము కావ్యము, తృతీయాశ్వాసము లోనిది యీ పద్యము.
No comments:
Post a Comment