వినువీధి నడయాడి విసివి తా నిచ్చలో
నిల దావగొనియున్న వెలుగుఱేడొ
లవణాబ్ధి వెలడు మైచవుడు వో దియ్య నీ
రాడంగ జొచ్చిన అమృతకరుడొ
ముదిమివో నిందుల యుదకంబు సేవించి
యెలబ్రాయమైయున్న నలువ యొక్కొ
ఱా నేల గిరిమీద మేనొత్తునని తమ్మి
విరులపై నెనసిన గిరిశుడొక్కొ
యబ్జనిలయమైన యమ్మతో నరిమిలి
దగిలియున్న తమ్మి దాల్పుడొక్కొ
యనుచు నుత్తరోత్తరైశ్వర్యుడగు బాలు
గారవించి చూచె నారదుండు.
తామరకొలనులో కుమారస్వామి పుట్టాడు. పై నుంచి నారదుడు చూసాడు. బాలుని అందానికి ముగ్ధుడయ్యాడు.
ఆకాశంలో తిరుగుతూ విసుగుపుట్టి నేల మీదకు దిగివచ్చిన సూర్యుడా, ఉప్పునీటి సముద్రము నుండి పైకి వచ్చి, ఒంటికి పట్టిన చవుడును వదిలించుకోడానికి మంచినీటి కొలనులో స్నానం చేయడానికి ప్రవేశించిన చంద్రుడా, ముసలితనం పోగొట్టుకోడానికి, యీ సరస్సులో నీరు త్రాగి యవ్వనం పొందిన బ్రహ్మదేవుడా, రాతినేల మీద శరీరం ఒత్తుకుంటుందని, తామరపూల మీద సేదదీరుతున్న శివుడా, పద్మం నివాసంగా ఉన్న లక్ష్మితో ప్రేమతో కూడియున్న విష్ణువా, అని పోను పోను ఐశ్వర్యవంతుడవుతున్న బాలకుమారస్వామిని నారదుడు చాలా ఆదరంగా చూసాడు.
ఈ పద్యం నన్నెచోడుని కుమారసంభవము దశమాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment